రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ పెద్దల అసహనం పెరిగిపోతోంది. తమకు నచ్చని పని చేసే వారిని టార్గెట్ చేస్తూ వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపే ముసాయిదా జీవోను లీకు చేశారని ఆరోపిస్తూ సచివాలయంలో వారం క్రితం ఓ ఉద్యోగిపై, తాజాగా మరో ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తమకు సరిపడని అధికారులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడున్నరేళ్లలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. సీఎంకు బంధువైన ఎంవీఎస్ మూర్తికి చెందిన గీతం మెడికల్ కాలేజీకి డీమ్డ్ హోదా ఇవ్వడానికి నిరాకరించారనే నెపంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను యువజన సర్వీసు శాఖకు ప్రభుత్వం మార్చేసింది.