మద్యం ఆదాయం పెంచుకునేందుకు సర్కారు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. బెల్టు షాపులు, పర్మిట్ రూంల ద్వారా జనం చేత ఫుల్లుగా తాగిస్తున్న ప్రభుత్వం డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేసేందుకు అదనపు మద్యం డిపోలను ఏర్పాటు చేయనుంది. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సరుకును డిపోల్లో ఉంచేందుకు ఆగమేఘాల మీద రాష్ట్రంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లో 24 మద్యం డిపోలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో తొమ్మిది ఏర్పాటు కానున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ. 13,640.22 కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే(డిసెంబర్ 1నాటికి) మద్యం అమ్మకాలు రూ. 11 వేల కోట్లు దాటాయి. మార్చి నాటికి మద్యం అమ్మకాలు రూ. 17 వేల కోట్లు దాటాలని లక్ష్యం విధించిన సర్కారు అదనంగా మద్యం డిపోలను ఏర్పాటు చేసి మద్యం షాపులకు అమ్మకాల టార్గెట్లు విధించనుంది. దీనికి తోడు వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉండటం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మద్యం డిపోల ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సర్కారు ఈ ఆలోచన చేస్తోందని పలువురు అధికారులు అంటున్నారు. తమకు అనుకూలంగా ఉండి, పదవీ విరమణ చేసిన ఓ అధికారికి డిపోల పర్యవేక్షణ బాధ్యత అప్పగించడంతో సర్కారు వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.