సాక్షి, టాస్క్‌ఫోర్స్: కంచే చేను మేసిన చందంగా ప్రజలను రక్షించాల్సిన పోలీస్ అధికారి భక్షకుడిగా మారి లంచాలు పేరుతో జలగాల పీడిస్తూ కోట్లు రూపాయిలు దండుకుంటున్నారని కృష్ణా జిల్లా గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్‌పై టీడీపీకి చెందిన తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తాతేపాముల నాగయ్య రుషి ఆరోపిస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టేషన్‌కు వచ్చే కేసులు, వ్యవహారాల విషయంలో దోచుకో, దాచుకో అన్నట్లుగా సీఐ శివప్రసాద్ వైఖరి ఉందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, దళితులు న్యాయం కోసం వెళ్తే కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీఐగా ఇక్కడ చార్జ్ తీసుకున్న రెండేళ్లలోనే ఆయన రూ.20 కోట్లు దండుకున్నారని, సాక్ష్యధారాలతో సహా అవినీతిని నిరూపిస్తానని చాలెంజ్ విసిరారు.
