బ్రాందేయవాదాన్ని నమ్ముకున్న కాంగ్రెస్: షర్మిల | Sakshi
Sakshi News home page

బ్రాందేయవాదాన్ని నమ్ముకున్న కాంగ్రెస్: షర్మిల

Published Wed, Jun 26 2013 9:13 PM

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మారిస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మద్యంధ్రప్రదేశ్ గా మార్చిందని షర్మిల విమర్శించారు. కిరణ్‌ పాలనలో రాష్ట్ర అభివృద్ధి బంద్‌ అయిందని అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఈ సాయంత్రం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం మద్యం ప్రవాహానికి లాకులు ఎత్తిందనని ఆరోపించారు. కిరణ్‌ పాలనలో మద్యం దుకాణాలు మినీ బార్లుగా మారుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ గాంధేయవాదాన్ని వదిలి బ్రాందేయవాదాన్ని నమ్ముకుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మనశ్శాంతి కరువయిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బెల్టుషాపులకు ఆద్యుడు చంద్రబాబు అని షర్మిల గుర్తుచేశారు. విద్యార్థులు స్కాలర్ షిప్ లు అడిగితే లాఠీలతో కొట్టించిన ఘనత ఆయనదని చెప్పారు. చంద్రబాబునాయుడు హయాంలో కేవలం 16 లక్షల మందికి పింఛన్ ఇస్తే, వైఎస్సార్ 71 లక్షల మందికి ఇచ్చారని తెలిపారు. తాండవ రిజర్వాయర్‌ మరమ్మతులకు వైఎస్‌ఆర్‌ నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. అనారోగ్యంతో ఎవరూ ఇబ్బందిపడకూడదని వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుట్ర చేసి జగనన్నను జైలుకు పంపాయని ఆరోపించారు. జగనన్న ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని, రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారని చెప్పారు. అప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని కోరారు. ఏ ఎన్నికలు వచ్చినా ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపించాలన్నారు. తన కోసం పనులు మానుకుని వచ్చిన వారందరికీ షర్మిల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.