భూసేకరణ బిల్లుకు టీడీపీ మద్దతు | TDP Supports Land Acquisition Bill | Sakshi
Sakshi News home page

Jul 18 2015 6:49 AM | Updated on Mar 22 2024 11:06 AM

విజయవాడ బ్యూరో: కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న భూసేకరణ బిల్లుకు పూర్తి మద్దతునివ్వాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిత్రపక్ష టీడీపీ, బీజేపీల పార్లమెంట్ సభ్యుల సమావేశం తీర్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మిత్రపక్ష పార్టీల ఎంపీల సమావేశం శుక్రవారం నాడిక్కడ విజయవాడలో జరిగింది. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానంతరం కేంద్రమంత్రి సుజనాచౌదరి భేటీ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామనీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావిస్తామని సుజనాచౌదరి పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ప్రకటించే విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి 60 శాతం ఆమోదం లభించినట్లేననీ, మరో నెలరోజుల్లో సమస్యలన్నీ పూర్తవుతాయన్నారు. రాజధాని, పోలవరం నిర్మాణ నిధులు, ప్రోత్సాహకాలు, కరువు సాయం నిధుల కోసం పార్లమెంటులో గట్టిగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ అంశం కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తోందనీ, ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పంటలకు కనీస మద్దతు ధర, ఇన్‌పుట్ సబ్సిడీలపైనా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పుష్కరాల్లో తొలిరోజు 27 మంది మృతి చెందడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8ను అమలు పర్చడం ద్వారా స్థానికేతరుల ఆస్తులకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరనున్నామని వివరించారు. హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తుల పంపకంపై వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి పరస్పర సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించాలని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని 30 వేల ఎకరాల అటవీ భూములను డీ ఫారెస్ట్ చేయాలని కేంద్రాన్ని కోరనున్నామని వివరించారు. జీఎస్‌టీ ఆమోదానికి మద్దతు ఇవ్వనున్నామన్నారు. పవన్ వ్యాఖ్యలపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని సుజనా పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఎంపీలు గల్లా జయదేవ్ (గంటూరు), కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), కేశినేని శ్రీనివాస్ (విజయవాడ), కె.రామ్మోహన్‌నాయుడు (శ్రీకాకుళం), శ్రీరామ్ మాల్యాద్రి (బాపట్ల) రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement