అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కంకణం కట్టుకున్న బీజేపీ తరఫున మోదీ మంగళవారం రాష్ట్రంలోని అరాలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటంతో పాటు.. సహర్సలో ఎన్నికల సభలో ప్రసంగించారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం దేశానికి తిరిగివచ్చిన మోదీ.. కొన్ని గంటల్లోనే బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు.. మోదీని పట్నా విమానాశ్రయంలో ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్.. అరాలో జరిగిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన వేడుకలకు హాజరుకాలేదు. రాష్ట్రంలో మొత్తం 700 కి.మీ. నిడివి గల 11 జాతీయ ప్రాజెక్టులను రూ. 9,700 కోట్లతో నిర్మించే పథకానికి మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.