‘విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా వినూత్న కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. బీచ్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగానే దీన్ని నిర్వహిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిని అపహాస్యం చేసేలా విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీనిపై తొలిసారి స్పందించిన సీఎం మాత్రం తమ ప్రభుత్వ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజీలో 2వ ఆంధ్రప్రదేశ్ సైన్‌స కాంగ్రెస్-2016 సదస్సును చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహణను కొందరు అపహాస్యం చేసేలా ప్రకటనలు ఇస్తూ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను మొదటి నుంచి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే వ్యక్తినని చెబుతూ.. విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని ఉద్ఘాటించారు.