మహబూబ్నగర్ జిల్లాలో వోల్వో బస్సు దుర్ఘటన మరువక ముందే కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేలీ జిల్లాలోని కునిమల్లళ్లిలో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. 25 మంది గాయపడ్డారు. వీరిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. నిన్న సాయంత్రం 6.30 గంటలకు బెంగళూరు నుంచి ముంబైకి ఈ బస్సు బయలు దేరింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ప్రమాదానికి గురయినట్టు తెలుస్తోంది. బస్సు డివైడర్ను ఢీకొని టైరు పేలడంతో మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపే మంటల్లో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ నెల 7న కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. బెంగళూరు-తుమకూరు రోడ్డులోని గురగుంటపాళ్య సిగ్నల్ సమీపంలో కర్ణాటక రాష్ట్ర(కేఎస్) ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటలను ముందే గుర్తించి ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. తర్వాత వారు బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.
Nov 14 2013 6:52 AM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement