కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి ముస్లిం మైనార్టీలే బలంగా ఉన్నారని.. ముస్లింల అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా మైనార్టీవిభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించి, కోర్టు అభ్యంతరం చెప్పడం వల్ల 4 శాతం అమలు చేశారన్నారు. ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేశారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు అడుగులు ముందుకేసి ముస్లిం మైనార్టీలకు రాజకీయాల్లో కూడా 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముస్లింలకు డిప్యూటీ సీఎం, శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్, 4 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించారని పేర్కొన్నారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం అమలు చేశారని, హజ్‌యాత్ర చేసేవారికి ఆర్థిక సాయం చేశారన్నారు. రానున్న స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషిచేయాలని తెలిపారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నవారికే గుర్తింపు గౌరవం ఉంటాయని, రానున్న జగన్ 2.0 పాలన కార్యకర్తలకు మేలు చేసేవిధంగా ఉంటుందన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోరుకునే పార్టీ వైఎస్సార్‌సీసీయేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలకు చేసిందేమీ లేదని, గతంలో ముస్లింల ప్రాతినిధ్యం లేకుండానే ప్రభుత్వాన్ని నడిపిన ఘనత చంద్రబాబుదన్నారు. ప్లకార్డులు ప్రదర్శించినందుకు ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం ముస్లింలకు మేలుచేసిందో, ఏ ప్రభుత్వం కీడుచేసిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మైనార్టీ విభాగం స్టేట్ ప్రెసిడెంట్ ఖాదర్‌బాషా, జోనల్ ప్రెసిడెంట్ ఖాద్రి, జిల్లా అధ్యక్షుడు మదీనా దస్తగిరి, నగర అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, మాజీ హజ్‌హౌస్ ఛైర్మెన్ గౌస్‌లాజం, మైనార్టీనాయకులు సుభాన్‌బాష తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి


