● ఎమ్మెల్యే వరద వర్గీయునితో డబ్బు వసూలు చేయించాలని టీడీపీ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్ డిమాండ్
● ప్రవీణ్ వర్గీయుని ఎగ్జిబిషన్‌ను రద్దు చేయించిన ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో అధికార పార్టీ నేతల మధ్య ఎగ్జిబిషన్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ మాజీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు తమ అనుచరులు నిర్వహించే ఎగ్జిబిషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఏటా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ప్రతి ఏటా మున్సిపాలిటీ 45 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్‌కు వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల 28న నిర్వహించిన ఎగ్జిబిషన్ వేలం పాటలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయులు రూ.కోటి 85 లక్షలకు దక్కించుకున్నారు. జీఎస్టీతో సహా రూ.2.20 కోట్లు కాంట్రాక్టర్ చెల్లించాల్సి ఉంది. గతంలో కొంత మంది కాంట్రాక్టర్లు సక్రమంగా మున్సిపాలిటీకి డబ్బు చెల్లించకపోవడంతో వేలం దక్కించుకున్న ఐదు రోజుల్లోపే కాంట్రాక్టర్ పూర్తి మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనను మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పెట్టారు. వరద వర్గీయుడైన కాంట్రాక్టర్ వేలం రోజు నిర్వహించిన రూ.25లక్షలు మినహా మిగతా డబ్బు చెల్లించలేదు. అసలు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారా లేదా నిర్వహిస్తే పూర్తి డబ్బు ఎప్పుడు చెల్లిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కాంట్రాక్టర్ నుంచి డబ్బు ఎందుకు వసూలు చేయలేదు
నిబంధనల ప్రకారం ఐదు రోజుల్లోపు వసూలు చేయాల్సిన ఎగ్జిబిషన్ డబ్బు మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి ఎందుకు వసూలు చేయలేదని టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్‌ను కలిశారు. మున్సిపాలిటీ ఆదాయానికి గండికొట్టొద్దని, ప్రేక్షకులకు వినోదాన్ని అందించాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని కమిషనర్‌తో అన్నారు. కాంట్రాక్టర్‌కు సంబంధించిన పాన్ కార్డు, ఐటీ రిటర్న్ కూడా మీరు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దసరాలో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసుకున్న తర్వాత మున్సిపాలిటీకి ఎగనామం పెడితే ఎవరు బాధ్యులన్నారు. ఒక్క రూపాయి బాకీ ఉన్నా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడానికి వీలు లేదన్నారు. గెజిట్ ప్రకారం ఎగ్జిబిషన్‌లో టికెట్లను వసూలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఎగ్జిబిషన్ ప్రాంగణంలోనే ధర్నా చేస్తానని ప్రవీణ్ హెచ్చరించారు. కొత్తపల్లె పంచాయతీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు మున్సిపల్ అధికారులు అడ్డుపుల్ల వేయడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రవీణ్ అనుచరుడి ఎగ్జిబిషన్‌ను రద్దు చేయించిన ఎమ్మెల్యే వరద
టీడీపీ మాజీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతితోపాటు అన్ని అనుమతులు తీసుకుని దసరా నుంచి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎగ్జిబిషన్‌కు పంచాయతీ పరిధిలో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌కు సంబంధం లేదు. అయితే ప్రవీణ్ తన వర్గాన్ని కాపాడుకోవడంతోపాటు వరద వర్గీయుడిని దెబ్బతీయాలనే లక్ష్యంతో విశాల మైదానంలో తక్కువ డబ్బుతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ వల్ల తాను నష్టపోతానని మున్సిపల్ ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ ఎమ్మెల్యే వరదతోపాటు మున్సిపల్ కమిషనర్‌ను కలిశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో జిల్లా అధికారులు పంచాయతీ ఎగ్జిబిషన్‌ను నిర్వహించొద్దని లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వాస్తవానికి పంచాయతీ కాంట్రాక్టర్ అన్ని అనుమతులు తీసుకోవడంతోపాటు గ్రామ పంచాయతీకి డబ్బు కూడా లిఖిత పూర్వకంగా చెల్లించారు. నవంబర్ 26 నుంచి 2027 జనవరి 25వ తేదీ వరకు ఎగ్జిబిషన్ నడుపుకోవాలని తాజాగా పంచాయతీ కార్యదర్శి కాంట్రాక్టర్‌కు కొరియర్ ద్వారా లేఖ పంపినట్లు తెలిసింది. ఏది ఏమైనా టీడీపీ నేతల మధ్య జరుగుతున్న ఎగ్జిబిషన్ వార్‌తో అధికారులు నలిగిపోతున్నారు. ఎస్‌ఎస్ మాల్ మొదలు అనేక అంశాలకు సంబంధించి వరదరాజులరెడ్డి, ప్రవీణ్ రెడ్డిల మధ్య వివాదం సాగుతోంది.


