●అభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

●అభివృద్ధికి చర్యలు

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

●అభివృద్ధికి చర్యలు

పుష్పగిరి క్షేత్రం

కడప సిటీ: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎన్నో చారిత్రక, ఆథ్యాత్మిక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఉన్నప్పటికీ పాలకుల పర్యవేక్షణ లోపంతో పర్యాటకరంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. మౌలిక వసతుల లేమి వల్ల జిల్లాలోని ప్రముఖ కేంద్రాలన్నీ నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్నాయి. గండికోట ఉత్సవాల పేరుతో ఏటా కోట్లాది రూపాయల నిధులతో ఆర్భాటంగా ప్రచారం నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం.. ఆ తర్వాత అక్కడి ప్రాంతాల శాశ్వత అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేస్తోందని పర్యాటకులు మండిపడుతున్నారు.

చారిత్రక క్షేత్రాల్లో క్షేత్రస్థాయి దుస్థితి ఇదీ:

గండికోట (గ్రాండ్‌ క్యాన్యన్‌ ఆఫ్‌ ఇండియా): దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నా ఇక్కడ కనీస తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు లేవు. రాత్రి వేళల్లో తగిన విద్యుత్‌ దీపాలు లేక చీకట్లు అలుముకుంటున్నాయి. పెన్నాలోయ వ్యూ పాయింట్‌ వద్ద రక్షణ గోడలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇక్కడ ప్రతిపాదించిన అడ్వెంచర్‌ క్రీడలు, రోప్‌వే ప్రాజెక్టులు నేటికీ అమలుకు నోచుకోలేదు.

ఒంటిమిట్ట: శ్రీ కోదండరామస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, సీతారాముల కల్యాణ సమయంలో తప్ప సాధారణ రోజుల్లో భక్తులకు కనీస వసతులు దూరమవుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ నిర్మించిన వసతి గృహాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక తాళాలకే పరిమితమయ్యాయి.

సిద్ధవటం.. పుష్పగిరి: చారిత్రక నేపథ్యంగల సిద్ధవటం కోట చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ‘రెండవ హంపి’గా పిలవబడే పుష్పగిరి ఆలయ సముదాయాలు కూడా సరైన సంరక్షణ లేక శిల్పాలు దెబ్బతింటున్నాయి. ఈ ప్రాచీన ప్రాంతాల ప్రాశస్త్యాన్ని తెలిపే సమాచార కేంద్రాలు గానీ, గైడ్ల సహకారం గానీ ఎక్కడా లభించడం లేదు.

శిల్పారామం.. ఇడుపులపాయ: కడప నగర వాసులకు ఏకై క మానసిక ఉల్లాస కేంద్రంగా ఉన్న శిల్పారామం, ప్రకృతి ఒడిలో మురిపించే ఇడుపులపాయ నెమళ్ల పార్కు, ఎకో పార్కులు ప్రస్తుతం సరైన నిర్వహణ నిధులు లేక పూర్తిగా కళ తప్పుతున్నాయి.

పర్యాటక అభివృద్ధికి ఏం చేయాలి?

జిల్లాలో పర్యాటక రంగం పూర్వవైభవం సంతరించుకుని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం, అటవీ మరియు పర్యాటక శాఖల అధికారులు యుద్ధప్రాతిపదికన పలు కీలక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

● ప్రత్యేక టూరిజం కనెక్టివిటీ బస్సు: జిల్లాలోని ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలైన గండికోట, ఒంటిమిట్ట, పుష్పగిరి, సిద్ధవటం ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రతిరోజూ ప్రత్యేక టూరిజం బస్సులను నడపాలి.

● పీపీపీ విధానంలో మౌలిక వసతులు: పర్యాటక ప్రాంతాల్లో నాణ్యమైన హోటళ్లు, రెస్టారెంట్లు, రోప్‌వేల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

● టూరిజం పోలీస్‌ వ్యవస్థ: పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల రక్షణ కోసం భద్రతను పెంచేందుకు ప్రత్యేకంగా ‘టూరిజం పోలీస్‌’ చౌకీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది.

● నిరంతర పారిశుధ్య పర్యవేక్షణ: అన్ని పర్యాటక కేంద్రాల్లో ఆధునిక మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. పారిశుధ్య పనులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.

ఈ చర్యలన్నీ పక్కాగా చేపడితే వైఎస్సార్‌ కడప జిల్లా పర్యాటక పరంగా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నేళ్ల చరిత్ర గల వారసత్వ సంపదను కాపాడుకోవడమే ఇప్పటి తక్షణ కర్తవ్యం.

గండికోటలో ప్రస్తుతం కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రూ.78 లక్షల నిధులతో ప్రత్యేకంగా టాయిలెట్లు, ఆయా వ్యూ పాయింట్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. గండికోటతో పాటు జిల్లాలోని మిగతా పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూడా త్వరలోనే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. – సురేష్‌కుమార్‌,

జిల్లా పర్యాటకశాఖ అధికారి, కడప

అడుగడుగునా నిర్లక్ష్యం..

వెలవెలబోతున్న చారిత్రక,

ప్రకృతి రమణీయ క్షేత్రాలు

గండికోట, ఒంటిమిట్ట, పుష్పగిరి,

సిద్ధవటంలో కరువైన

కనీస భద్రత, వసతులు

నిధుల లేమితో కళ తప్పుతున్న కడప

శిల్పారామం, ఇడుపులపాయ ఎకో పార్కు

గండికోటలో రూ.78 లక్షలతో

మౌలిక పనులు.. మిగతా ప్రాంతాలపైనా దృష్టి పెట్టాలంటున్న జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement