జగన్‌ ప్రభుత్వంలోనే ప్రొద్దుటూరుకు నీటి పథకం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ ప్రభుత్వంలోనే ప్రొద్దుటూరుకు నీటి పథకం

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణానికి నీటి సమస్య లేకుండా చేసింది గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే. అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితోపాటు మున్సిపల్‌ పాలక వర్గం చూపిన ప్రత్యేక చొరవతో ప్రొద్దుటూరు నీటి సమస్య పరిష్కారమైంది. జిల్లాలో కడప తర్వాత పెద్ద పట్టణంగా ఉన్న ప్రొద్దుటూరు పెన్నానది ఒడ్డునే ఉంది. పట్టణంలో దాదాపు 2 లక్షల జనాభా ఉంది. ఎగువ ప్రాంతంలో మైలవరం జలాశయం నిర్మించడంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు మినహా నది ప్రవహించే పరిస్థితి లేదు. మున్సిపల్‌ అధికారులు పెన్నానది పరివాహాక ప్రాంతాల్లో బోర్లు వేసి నీటిని సరఫరా చేసేవారు. ఏటా వేసవిలో మాత్రం మున్సిపల్‌ అధికారులు, స్థానిక పాలకులు కలెక్టర్‌కు లేఖ ద్వారా విన్నవించుకుంటే... ఆయన మైలవరం నుంచి అంతో ఇంతో నీటి విడుదలకు అనుమతి ఇచ్చేవారు. ఈ నీటిని మైలవరం గేట్ల ద్వారా కాకుండా మైలవరం దక్షిణ కాలువ ద్వారా విడుదల చేయించుకుని మార్గ మధ్యంలోని సిరిగేపల్లె చెరువుకు నింపి అక్కడి నుంచి పెన్నానదికి తీసుకొచ్చేవారు. ఇందు కోసం ప్రత్యేకంగా పోలీ సు బలగాలను ఏర్పాటు చేసేవారు. 0.03 టీఎంసీల నీటిని విడుదల చేయించేవారు. నీటి విడుదల కోసం ప్రతి ఏడాది కొన్ని లక్షల రూపాయలు మున్సిపాలిటీ ఖర్చు పెట్టేది. చాలా ఏళ్లుగా పాలకులు ఇలా నీరు తెచ్చుకున్నారే కానీ శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు.

రాచమల్లు కృషితో పూర్తి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాచమల్లు శివప్రసాదరెడ్డి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మాట్లాడి రద్దయిన అమృత్‌ పనులను పునరుద్ధరింపజేశారు. మైలవరం రిజర్వాయర్‌లో 0.41 టీఎంసీల నీటిని ఇందుకోసం కేటాయించారు. మైలవరం డ్యాం నుంచి 45 కిలోమీటర్ల పైపులైన్‌ ద్వారా ప్రొద్దుటూరుకు నీరు సరఫరా అవుతోంది. రూ.151.38 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకం మంజూరు చేశారు. ఈ నిధుల్లో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వాటా 60.38 శాతం ప్రకారం రూ.82.10 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాట 11.24 శాతం ప్రకారం రూ.15.29 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా ప్రకారం 28.37 శాతం ప్రకారం రూ.38.58 కోట్లు చెల్లించారు. మొత్తం రూ.135.97 కోట్లు చెల్లించారు. పూర్తయిన ఈ నీటి పథకాన్ని రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆహ్వానం మేరకు అప్పటి మంత్రులు ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత 2023 జూలై 20న ప్రారంభించారు. ఈ పనులన్నీ వైఎస్సార్‌ సీపీ హయాంలో జరిగితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీసీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రొద్దుటూరును వేదిక చేసుకుని ‘జల్‌ జీవన్‌ మిషన్‌ ’ పథకాన్ని ప్రారంభించి గొప్పలు చెప్పుకోవడంపై జిల్లా వాసులు విస్తుపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement