జల్‌జీవన్‌ సభలో మందూ మార్బలం | - | Sakshi
Sakshi News home page

జల్‌జీవన్‌ సభలో మందూ మార్బలం

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

● మందు.. డబ్బుతో జన సమీకరణకు పాట్లు

● ఆర్టీసీ బస్సుల్లోనే మద్యం పంపిణీ

● జనాలు రాక ఖాళీగా తిరిగొచ్చిన బస్సులు

● సీఎం చంద్రబాబు మాట్లాడకముందే

వెనుతిరిగిన మహిళలు

ప్రొద్దుటూరు క్రైం : ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సోమవారం ప్రొద్దుటూరులో చేపట్టిన జల్‌జీవన్‌ బహిరంగ సభకు జనాలను తరలించేందుకు టీడీపీ, జనసేన నాయకులు నానా తంటాలు పడ్డారు. మందు, డబ్బు ఆశ చూపి ప్రజలను తరలించాలని చేసిన యత్నాలు ఫలించలేదు. ఆర్టీసీ బస్సుల్లోనే మద్యం పంపిణీ చేసినా సభకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. దీంతో గ్రామాలకు వెళ్లిన చాలా బస్సులు ఖాళీగానే తిరిగొచ్చాయి. సభకు ప్రజలను తరలించేందుకు అనేక ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నేతలు డబ్బులు, మద్యం పంపిణీ చేసిన దృశ్యాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. సభకు వచ్చే పురుషులకు రూ.200పాటు మద్యం బాటిల్‌, మహిళలకు రూ.300 ఇచ్చి బతిమాలి మరీ సభకు ద్వితీయ శ్రేణి నాయకులు తరలించారు. కొన్నిచోట్ల డబ్బు చేతిలో పెట్టి సభకు రావాలని మాట తీసుకుని బస్సు ఎక్కించగా, కొన్నిచోట్ల ముందుగానే ఇస్తే సభకు రారనే ఉద్దేశంతో సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో డబ్బును బస్సుల్లోనే పంపిణీ చేశారు. బద్వేలు టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సుల్లోనే టీడీపీ నాయకులు మద్యం బాటిళ్లు పంపిణీ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్‌ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇదేమి తీరంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే డబ్బు, మద్యం ఆశచూపినా చాలా గ్రామాల నుంచి ప్రజలు సభకు రాకపోవడంతో డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ టీడీపీ నేతలు సభకు తీసుకొచ్చారు. సభా ప్రాంగణంలోనే అటెండెన్స్‌ తీసుకున్నారు. అయితే సరైన వసతులు లేకపోవడంతో పిల్లలతో వచ్చిన మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. టెంట్లు లేక ఎండ తీవ్రత తాళలేక ఆపసోపాలు పడ్డారు.

సభ ప్రారంభానికి ముందే వెనుతిరిగారు

సభా ప్రాంగణానికి చేరుకున్న మహిళల్లో చాలామంది సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించకముందే తిరుగు ప్రయాణమయ్యారు. బస్సులు దిగిన తర్వాత కొద్దిసేపు అక్కడ ఉన్న మహిళలు కూర్చోడానికి వసతి లేక, ఎండ వేడిమికి తట్టుకోలేక వెనుతిరిగారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాకమునుపే గుంపులు గుంపులుగా మహిళలు వెళ్లిపోవడాన్ని చూసిన టీడీపీ నాయకులు వారిని నిలువరించే యత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement