వేముల : నారేపల్లె గ్రామానికి చెందిన దుంపల ఆకాష్‌రెడ్డి(7) అనే బాలుడు ఇంజెక్షన్ వికటించి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దుంపల మురళీమోహన్‌రెడ్డి తన కుమారుడికి జలుబు చేయడంతో ముతుకూరులోని ఆర్‌ఎంపీకి వద్దకు ఆదివారం సాయంత్రం తీసుకెళ్లాడు. అక్కడ ఆర్‌ఎంపీ పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి, ఆ పార్టీ మండల ఇన్‌చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, ఎస్వీ సతీష్‌రెడ్డి సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కుమారుడు రోహన్ నాగిరెడ్డిలు గ్రామానికి చేరుకుని బాలుడి తల్లిదండ్రులు మురళీమోహన్‌రెడ్డి, ఆమనిలను పరామర్శించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది.


