కనుపాపకు బ్రెయిన్‌ క్యాన్సర్‌.. కన్నీటి సుడిగుండంలో పేద కుటుంబం | - | Sakshi
Sakshi News home page

కనుపాపకు బ్రెయిన్‌ క్యాన్సర్‌.. కన్నీటి సుడిగుండంలో పేద కుటుంబం

Aug 4 2026 12:23 AM | Updated on Aug 4 2026 12:23 AM

రాజంపేట: రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద గూటిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ చిన్నారి.. అందరిలాగే నవ్వుతూ, ఆడుతూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. కానీ, విధి ఆ కనుపాపపై కనికరం చూపలేదు. లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన, అత్యంత ప్రమాదకరమైన ‘బ్రెయిన్‌ క్యాన్సర్‌’ ఆ పసి ప్రాణాన్ని కబళిస్తోంది. రాజంపేట పట్టణం నూనివారిపల్లెకు చెందిన కొత్త ఎల్లమ్మ, రాజా దంపతుల రెండో కుమారుడు కె.పవన్‌ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గడిచిన ఆరు నెలలుగా ఆ చిన్నారి శరీరంపై వరుసగా జరిగిన శస్త్రచికిత్సలు ఆ పేద తల్లిదండ్రుల గుండెలను పిండేస్తున్నాయి.

మాట పడిపోయింది..

గాలి పీల్చడమూ నరకమే!

క్యాన్సర్‌ మహమ్మారి తీవ్రత వల్ల పవన్‌కు కాళ్లు, చేతులు పూర్తిగా పడిపోయాయి. కనీసం నోరు తెరిచి అమ్మా అని పిలిచే భాగ్యానికి కూడా ఆ బాలుడు దూరమయ్యాడు. కనీసం శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా మారడంతో.. వైద్యులు గొంతు భాగంలో ఆపరేషన్‌ చేసి, అక్కడ అమర్చిన పైపు ద్వారా కృత్రిమంగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఆ పసి ప్రాణం నిలవాలంటే ప్రతిరోజూ ఏకంగా 26 మాత్రలు మింగాల్సి వస్తోంది.

మందులకూ డబ్బుల్లేక..

చిన్నారి వైద్యం కోసం ఆ కుటుంబం ఇప్పటికే ఉన్నదంతా అమ్ముకుని, అప్పుల పాలై రోడ్డున పడింది. ప్రస్తుతం రోజువారీ మందుల ఖర్చులు, మాత్రలు కొనడానికి కూడా వారి వద్ద చిల్లిగవ్వ లేని దయనీయ స్థితి నెలకొంది. కళ్లముందే కొడుకు ప్రాణాలు గాల్లో దీపంలా మారుతుంటే కాపాడుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సహృదయం గల దాతలు, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థికంగా ఆదుకుంటే తమ బిడ్డ బతుకుతాడంటూ వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు.

మనసున్న దాతలు సహకరించండి

బ్రెయిన్‌ ట్యూమర్‌ జబ్బుతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి పవన్‌ను కాపాడుకునేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. సహాయం చేయదలచిన వారు ఫోన్‌పే / గూగుల్‌పే నంబరు: 8886350998 (బ్యాంక్‌ ఖాతాదారు పేరు: కె.ఎల్లమ్మ, అకౌంట్‌ నంబరు: 602010016830975, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌: UBIN0 CG7999, బ్యాంక్‌ పేరు: ఏపీజీబీ, పొందలూరు శాఖ)కు డబ్బు పంపించాలని కోరుతున్నారు.

ఆరునెలలుగా నరకయాతన

కాళ్లు, చేతులు పడిపోయి చిన్నారి విలవిల

గొంతుకు ఆపరేషన్‌ చేసి ఆక్సిజన్‌ సరఫరా

రోజుకు 26 మాత్రలు మింగాల్సిన దుస్థితి

మందులకూ డబ్బుల్లేక

దాతల సాయం కోసం ఎదురుచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement