అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

ప్రమాదం అంటున్న పోలీసులు

మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు

చక్రాయపేట : మండలంలోని గాలివీడు క్రాస్‌లో గల కల్వర్టు కింద అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన సోమవారం దావానంలా వ్యాపించింది. మృతులు పులివెందుల టౌన్‌ నగరి గుట్టకు చెందిన బుకే మహేష్‌ నాయక్‌(25), కాళ్ల దీపిక(21) గా పోలీసులు గుర్తించారు. సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ పేర్కొంటుంటే.. అక్కడ చూసిన వారు మాత్రం హత్యలే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మహేష్‌నాయక్‌ తల్లి సుజాత లింగాల మండలంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. తండ్రి మంగే నాయక్‌ రైతు. వీరికి ఏకై క సంతానమైన మహేష్‌ నాయక్‌ ఓ ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే వాడు. గత విద్యాసంవత్సరం ప్రారంభ సమయంలో ఆ పాఠశాలలో విద్యార్థులు లేరని మూసివేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఆయనను వేంపల్లె టౌన్‌ శ్రీరామనగర్‌ ప్రభుత్వ పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపడంతో అక్కడ పని చేస్తున్నారు. అలాగే కాళ్ల దీపిక విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం జర్జాపుపేటలోని శివాలయం వీధికి చెందిన గంగాధర్‌ (ఎక్స్‌ఆర్మీ) కుమార్తె. ఈమె పులివెందులలో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ చదువుతుండేది. దీంతో వీరిద్దరి మధ్యన ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో.. పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అయితే దీపిక బంధువులు మాత్రం తమ అమ్మాయికి వివాహం కాలేదని చెబుతున్నారు. మహేష్‌నాయక్‌ పాఠశాలకు వచ్చే సమయంలో ఆయనతో కలిసి వేంపల్లెకు వస్తుండేదని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఆ సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారో..

సంఘటన అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో వారు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుండగా.. ఈ ఘటన జరిగిందనే విషయం తెలియరాలేదు. రాత్రి 8–45 గంటలకు తిరుపతిలోని రిలయన్స్‌ మాల్‌లో షాపింగ్‌ చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయని ఎస్సై చెబుతున్నారు. పులివెందుల నుంచి వారిద్దరూ ద్విచక్ర వాహనంలో తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసుల వాదన. ఆ సమయంలో వారు వస్తూ నిద్ర మత్తులో రోడ్డు పక్కన కల్వర్టు వద్ద కాలువలో పడి చనిపోయారని పోలీసులు చెబుతుంటే.. సంఘటన చూసిన వారు మాత్రం బైక్‌ పెద్దగా దెబ్బతినలేదని, ఆమె తల నుజ్జునుజ్జుగా అయిందని చర్చించుకుంటున్నారు. పైగా మహేష్‌ మృతదేహం కల్వర్టు కింద దూరంగా ఎందుకు పడుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో అనుమానాలు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన వారు పేర్కొంటున్నారు. ప్రమాదవశాత్తా లేక హత్యా అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. కాగా వారిద్దరూ బాగా డ్యాన్స్‌ చేస్తారని, పిల్లలకు డ్యాన్స్‌ కూడా నేర్పిస్తుంటారని పలువురు పేర్కొన్నారు.

పులివెందులకు మృతదేహాలు

గాలివీడు క్రాస్‌ వద్ద చనిపోయిన మహేష్‌ నాయక్‌, దీపికల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే దీపిక తల్లిదండ్రులు విజయనగరం జిల్లా నుంచి బయలుదేరడంతో వారి కోసం పోస్టుమార్టాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుల తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement