టీడీపీ నేతల చేతుల్లో చిక్కి శల్యమవుతున్న నదులు నిబంధనల హద్దులు మీరి.. ఇసుకను సరిహద్దులు దాటిస్తున్న పచ్చ నేతలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల చేతుల్లో చిక్కి శల్యమవుతున్న నదులు నిబంధనల హద్దులు మీరి.. ఇసుకను సరిహద్దులు దాటిస్తున్న పచ్చ నేతలు

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

సాక్షి అన్నమయ్య : తెలుగు తమ్ముళ్లు ఇసుకలో తైలం పిండుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తమ్ముళ్లకు ఆర్థిక వనరులు అనుకున్న మేర లభించలేదు. దీంతో ఉచిత ఇసుక పేరుతో దండుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్‌ జిల్లాలోని పలు నదుల్లో పొక్లెయిన్లు పెట్టి టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. చెయ్యేరు పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ కొనసాగుతున్నా ఎవరూ కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

● అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాలో విస్తరించి ఉన్న చెయ్యేరు నదిపై పచ్చనేతల కన్ను పడింది. ఒక వైపు ట్రాక్టర్ల ద్వారా ఎక్కడికక్కడ ఇసుక తోడేస్తుండగా, అది చాలదన్నట్లుగా మరోవైపు ఏకంగా టిప్పర్లు పెట్టి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించి పచ్చనేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. చెయ్యేరు ప్రాంతంలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల సరిహద్దులోని పలు గ్రామాల నుంచి ఇసుకను నిత్యం తరలిస్తున్నారు. జంగాలపల్లె సమీపంలోని దర్జిపల్లె వద్ద టిప్పర్లతో తోడేస్తున్నారు. అలాగే నందలూరు మండలంలోని కుమారునిపల్లె, బాలరాజుపల్లె సమీపంలో బుడుగుంటపల్లె, సుండుపల్లె మండలంలోని పలు ప్రాంతాలతోపాటు రామసముద్రం మండల పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను అటు బెంగుళూరు, ఇటు చైన్నెలకు తరలిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు

చెయ్యేరు, పెన్నానదులకు ఇసుకాసురులు గర్భశోకం మిగుల్చుతున్నారు. అధికారులు ఒకచోట అనుమతులు ఇస్తే....కుంటి సాకులు పెట్టి మరొకచోట తవ్వుతూ ఇసుక దోపిడీ చేస్తున్నారు. కొన్నిమీటర్ల మేర మాత్రమే ఇసుకను తీయాల్సి ఉండగా, పెద్ద పెద్ద గుంతలు తీసి తరలిస్తున్నారు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా, మనకెందుకులే మనవారేనని కూటమి పెద్దలు చూస్తుండిపోతున్నారు. కొన్ని చోట్ల నదుల్లో దారులు ఏర్పాటు చేసుకుని ఇసుకను రాత్రిళ్లే కాకుండా పగలు కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల సుండుపల్లె మండలంలో ప్రజలు టిప్పర్లను సైతం అడ్డుకుని తిరుగుబాటు చేశారంటే అక్రమ తవ్వకాలు ఎలా కొనసాగిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది.

ఎప్పుడో ఒకసారి అలా

నదుల్లో ఇసుకను కూటమి సర్కార్‌లోని కొంతమంది పెద్దలు దోపిడీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు. పత్రికల్లో వార్తలు ప్రచురితమైతే అప్పుడప్పుడు అలా దాడులు జరిపి... పట్టుకున్నట్లు హడావుడి చేస్తున్నారు. రోజుల తరబడి ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా పట్టించుకోరుగానీ, ఎప్పుడో ఒకసారి దాడులు చేసి తామున్నామంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఏదిఏమైనా కూటమి సర్కార్‌ ఉచిత ఇసుక పేరుతో తెచ్చిన విధానం కొంతమంది పచ్చనేతల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతోందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement