కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప నగరం జయనగర్ కాలనీలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 8న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి జూన్ 8 వరకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు.
తిరుపతి–చాప్రా మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : వేసవి రద్దీని పురస్కరించుకుని తిరుపతి–చాప్రా మధ్య ప్రత్యేక రైలును నడపుతున్నారని కడప రైల్వేకమర్షియల్ మేనేజర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి 11.55 గంటలకు ఈ రైలు (07433) తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి,డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తిరోడ్డు, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, కాచిగూడ, మల్కాజ్‌గిరి, కామారెడ్డి, నిజామాబాద్, ముడ్కేడ్, నాందేడ్, పూర్ణ, హింగోలి, వాషిమ్, అకోల, మల్కాపూర్, ఖాడ్వా, ఇట్సాసి, భూపాల్, బిన, లక్ష్మీభాయిజాన్సీ, ఓరాయి కన్పూర్, లక్నో, అయోధ్య కెంట్, అయోధ్యమ్, బస్తీ, గోరక్‌పూర్, సిజ్వాన్ మీదుగా చాప్రాకు 10వ తేది ఉదయం 7.45 గంటలకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 12వ తేదీ ఉదయం 5.00 గంటలకు చాప్రాలో బయలుదేరి 14వ తేది మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుతుందని తెలిపారు.
రెమెడియల్ తరగతులకు హాజరుకావాలి
– పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్
కడప ఎడ్యుకేషన్: ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రెమెడియల్ తరగతులకు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్లాస్ టీచర్స్ బాధ్యత తీసుకోవాలని పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ ఆదేశించారు. బుధవారం కడప నగరంలోని నగరపాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ప్రభుత్వ పాఠశాల, నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ పాఠశాలలలో నిర్వహిస్తున్న తరగతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెమెడియల్ క్లాసుల నిర్వహణ బాధ్యతలను మండల విద్యాశాఖ అధికారులు ఉపవిద్యా శాఖ అధికారులతోపాటు జిల్లా విద్యా శాఖ అధికారి ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి సప్లిమెంటరీలో పాస్ అయ్యే విధంగా ప్రణాళిక బద్ధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి అహ్మద్, ఇర్షాద్ అహ్మద్ పాల్గొన్నారు.


