కడప సెవెన్‌రోడ్స్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరమణిరెడ్డి, కడప నగర అధ్యక్షుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ చంద్రగిరిలో విద్యార్థి విభాగం నిర్వహిస్తున్న జోనల్ సమావేశానికి బుధవారం తరలివెళ్లారు. ఈ సందర్బంగా కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద వారు మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఎత్తిపోతల పథకం జీవనాడిలాంటిదని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తరలిస్తోందని, ఈ పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాజెక్టులకు నీరందడం కష్టతరమవుతుందన్నారు. అందుకే వైఎస్ జగన్ ముందుచూపుతో సీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రయో జనాలను తెలంగాణకు తాకట్టుపెట్టి ఎత్తిపోతల పనులను చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వానికి సీమపై చిత్తశుద్ది ఉంటే ఈ పథకం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కడప, కర్నూలు జిల్లాల విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.


