రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
– మరొకరి తీవ్రగాయాలు
చాపాడు : మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని చాపాడు సమీపంలోని వరి ధాన్యపు గోడౌన్ ఎదురుగా శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చెన్నూరుకు చెందిన తలారి మహేంద్ర (35) అనే వ్యక్తి మృతి చెందగా, అభినవ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నూరుకు చెందిన మహేంద్ర, అభినవ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా స్కూటీపై ప్రొద్దుటూరుకు వెళుతుండగా చాపాడు సమీపంలోని గోడౌన్ వద్ద ముందు వెళ్లే లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో స్కూటీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేంద్ర మృతి చెందగా, అభినవ్ చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
ట్రాక్టర్ ఎక్కుతుండగా..
పోరుమామిళ్ల : రంగసముద్రం గ్రామానికి చెందిన బోయలకుంట్ల సుభాన్‌బాషా(18) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శుక్రవారం వసుంధర కళ్యాణమండపం వద్ద రన్నింగ్‌లో ఉన్న ట్రాక్టర్‌ను ఎక్కే ప్రయత్నంలో జారి కిందపడి గాయాల పాలయ్యాడని ఎస్‌ఐ కొండారెడ్డి చెప్పారు. ఈ మేరకు తీవ్ర గాయాలు కాగా తొలుత 108లో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి వెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. సుభాన్‌బాష మృతదేహానికి ప్రభుత్వ మాజీ సలహాదారు నాగార్జునరెడ్డి నివాళి అర్పించారు.
టిప్పర్ ఢీకొని..
కాశినాయన : మండలంలోని గంగనపల్లెకు చెందిన మల్లెబోయిన వెంకటరామయ్య (73) అనే వృద్ధుడు టిప్పర్ ఢీకొని శనివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటరామ య్య పొలం వద్దకు బైక్‌పై వెళుతుండగా.. ముందు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా రివర్స్ నడపడంతో టిప్పర్ వెనకున్న వెంకటరామయ్య టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాశినాయన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


