టోల్‌గేట్ లెక్క తేలేనా !
టోల్ గేట్ నిర్వహణపై న్యాయ పోరాటం
జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోట సమీపంలో ఏర్పాటు చేసిన టోల్ గేట్ నిర్వహణపై విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న డబ్బులకు పర్యాటక శాఖ ఎటువంటి లెక్కలు చూపడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రూ.20లు వసూలు చేస్తున్న పర్యాటకశాఖ ఆ డబ్బులను అధికారులు, స్థానికులు సొంత ఖర్చులకు వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కొంత మంది టోల్ గేట్ నిర్వాహణపై న్యాయం పోరాటం చేయడం కోసం సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన గండికోట వారోత్సవాలలో వేలాది మంది పర్యాటకులు గండికోటను సందర్శించటానికి వచ్చారు. వచ్చిన వారికి కనీసం తాగటానికి మంచినీరు, మరుగు దొడ్లు సౌకర్యం కూడ కల్పించలేదనే విమర్శలు వచ్చాయి.
మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ....
గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శిశశంకర్ తోలేటి పర్యాటకులకు మౌళిక సదుపాయాలు కల్పించడంతోపాటు, పార్కింగ్ సౌకర్యం కోసం ప్రతి పర్యాటకుని నుంచి టోల్ వసూలు చేయాలని ప్రతిపాదన పెట్టి గండికోట వెలుపల టోల్ గేట్ వసూలు కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతిపర్యాటకుడి నుంచి 20 రూపాయలు, వాహనాలు ప్రత్యేక రుసుం నిర్ధారించారు. దాని నిర్వహణ పర్యాటకశాఖ, జిల్లా కలెక్టర్ చూస్తారంటూ అప్పట్లో ప్రకటించారు.
జరుగుతున్నదేంటి...
పర్యాటక కేంద్రమైన గండికోట ఆర్కియాలజి శాఖ కు సంబంధించిన విషయం. పర్యాటకశాఖ మాత్రం గండికోట ప్రాంతంలో ఎటువంటి మౌళికసదుపాయాలు కల్పించడంలేదు.పైగా వచ్చిన డబ్బులు పూర్తిగా తమ సొంత ఖర్చులకు వాడుకుంటున్నారే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పర్యాటక శాఖపేరుతో ముద్రించిన రశీదులు సైతం అనాథరైజ్‌డ్‌గా ఉండటంతో ఆ సొమ్మును స్థానికంగా ఉన్న పర్యాటకశాఖ అధికారులు, జిల్లా అధికారులు పంచుకుంటున్నారనే వాదన ఉంది. టోల్ గేట్ వసూలు చేయడం కోసం కొంత మందిని సిబ్బందిని నియమించి వారికి నెలకు పదివేల రూపాయలు జీతం ఇస్తున్నారు. నెలకు లక్షలకు పైగా వసూలు అవుతుందని స్థానికులు చెబుతున్నారు. మరి ఆ డబ్బులు ఎటు వైపు వెళ్తున్నాయో వాటి జమ ఖర్చుల వివరాలు చెప్పేనాథుడు కరువయ్యారు.
పర్యాటక కేంద్రమైన గండికోట వద్ద టోల్ గేట్ వసూలు చేయడం అన్యాయం. టోల్‌గేట్ ఎందుకు వసూలు చేస్తున్నారో ఆ నిధులు ఎవరికి ఖర్చు పెడుతున్నారో తెలియదు. గండికోటకు వచ్చే పర్యాటకు నుంచి డబ్బులు వసూలు చేయడం సరైందికాదు. గండికోట నిర్వాహణబాధ్యత ఆర్కియాలజి అధికారులది. పర్యాటకులకు ఎటువంటి సంబంధంలేదు. పర్యాటకశాఖ అధికారులకు నోటీసులు పంపించాం.
– భూతమాపురం సుబ్బారావు, న్యాయవాది, జమ్మలమడుగు
టోల్‌గేట్ లెక్క తేలేనా !


