కల్యాణోత్సవం.. చూసిన కనులదే భాగ్యం!
కడప సెవెన్‌రోడ్స్: శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి....అంటూ భక్తులు కుటుంబాలతోసహా ఆ కల్యాణ వేదికకు వేలాదిగా తరలివచ్చారు. భక్తిభావంతో కల్యాణ వేదిక ముందు ఆశీనులై కల్యా ణోత్సవాన్ని తిలకించారు. అయోధ్య ఐక్యవేదిక ప్రతినిధి దేసు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా అర్చక పురోహిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు విజయ్‌భట్టర్, ఇతర అర్చక బృందం ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ నినాదాలు, గోవింద నామస్మరణలు, కరతాళ ధ్వనులమధ్య కార్యక్రమం కమనీయంగా సాగింది. అతిథులుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, నగర మేయర్ పాకా సురేష్‌కుమార్, మాజీ మేయర్ సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్ బండి నిత్యాందనరెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతులు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు హాజరై కల్యాణాన్ని వీక్షించారు.
నయనానందకరం
కల్యాణ క్రతువు ఆద్యంతం నయనానందకరంగా సాగింది. స్థానిక మహిళా భక్తబృందం భక్తిగీతాలకు కోలాటాలు చేశారు. స్థానిక గాయక బృందం సీతారాములపై గీతాలాపనలు చేశారు. కల్యాణంఅనంతరం భక్తులందరికీ కల్యాణ తలంబ్రాలను అందజేశారు. చివరగా కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీరాముడు ఆదర్శ ప్రాయుడు : ఎంపీ
ధర్మానికి, త్యాగానికి ప్రతీకయిన శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శప్రాయుడని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు రైతులపై, రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు. అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కనుల పండువగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఐక్యవేదిక నాయకులను అభినందిస్తున్నామన్నారు. అయోధ్య ఐక్యవేదిక నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, సూర్యనారాయణ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ పాకా సురేష్ తదితరులు
వైభవంగా శ్రీ సీతారామ కల్యాణం
భక్తజన సంద్రంగా మారిన ప్రాంగణం
కల్యాణోత్సవానికి హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఇతర నేతలు
కల్యాణోత్సవం.. చూసిన కనులదే భాగ్యం!
కల్యాణోత్సవం.. చూసిన కనులదే భాగ్యం!


