సింహంపై నరసింహుడు
నేడు
కడప సెవెన్‌రోడ్స్: కడప రాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అరాచకాలు సృష్టిస్తున్న దుష్టులను అంతం చేసి శిష్ట రక్షణ చేసేందుకు దేవదేవుడు నరసింహుడై గర్జించాడు. శత్రువులను తుత్తునియలు చేసేందుకు విక్రమించాడు. ఆయుధ ధారియై పరాక్రమంతో వెళుతున్న ఆ పురుషోత్తముడిని చూసి భక్తులు తన్మయులయ్యారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం చిన్న శేష వాహనంపై మాడవీధుల్లో విహరించారు. తమ ఆరాధ్యదైవమైన కడప రాయుడు తమ ఇంటి ముంగిళ్లకే తరలి వచ్చి కరుణించే భాగ్యం ఇవ్వడంతో భక్తులు తన్మయులయ్యారు. పూజా ద్రవ్యాలు సమర్పించి మొక్కుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వాహన సేవ అనంతరం స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేశారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో కనుల పండువగా ఏర్పాటు చేసిన ఊయలపై సేద తీర్చారు. మంగళ వాయిద్యాలు, గాయకుల కమ్మని సంగీతం వింటూ స్వామి వింజామర సేవల మధ్య విశ్రమించారు. అనంతరం సింహంపై మలయప్పగా కడప రాయుడు నరసింహునిగా కొలువుదీరి భక్తులను కరుణించాడు. మహిళా భక్తబృందాలు పురుష బృందాలతో పోటీపడుతూ కోలాటాలు, భజనలు నిర్వహించారు. ప్రత్యేక వాయిద్య బృందాలు స్వామిని కీర్తిస్తూ సంగీతార్చన చేస్తూ ఊరేగింపుగా సాగారు.
కడప అర్బన్: కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం సందర్శించారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ అధికారులకు సూచనలిచ్చారు. జనవరి 25న రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. రథోత్సవం జరిగే మార్గాన్ని పరిశీలించారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచాలన్నారు. సి.సి కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లుకు సూచించారు.
వైభవంగా కడప రాయుడి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామి తిరుమాడవీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. ఉదయం 10.30 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.00 గంటలకు ఊంజల సేవ, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల కీర్తనల ఆలాపనలు నిర్వహిస్తారు. రాత్రి 8.00 గంటల నుంచి స్వామిని హనుమంతవాహంనపై ఊరేగించనున్నారు.
సింహంపై నరసింహుడు


