కామాంధుడికి కొమ్ముకాసిన పచ్చనేతలు
మైనర్‌ను మాయమాటలతో లోబర్చుకున్న ఓ రెవెన్యూ ఉద్యోగి
అనంతరం బ్లాక్‌మెయిల్ చేస్తూ నిత్యం లైంగిక దాడి
వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
కామాంధుడికి మద్దతుగా రంగంలోకి టీడీపీ నాయకులు
కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్‌లోనే పంచాయితీ
నిందితుడి నుంచి భారీగా చేతులు మారిన నగదు
వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు మండలంలో ఘటన
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఓ బాలిక శీలానికి లక్ష రూపాయలు ఖరీదు కట్టిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురై తమను ఆశ్రయించిన బాలికకు అండగా నిలవాల్సిన పోలీసులు టీడీపీ నేతల పంచాయితీకి పూర్తి స్థాయిలో సహకారం అందించి కామాంధుడిని రక్షించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం మేరకు... చెన్నూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోగా తల్లితో కలిసి ఉంటోంది. అదే గ్రామంలో పని చేస్తున్న ఓ రెవెన్యూ ఉద్యోగి ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తర్వాత తరచూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ బాలికపై లైంగికంగా దాడి చేస్తున్నాడు. ఈ వేధింపులను భరించలేక సదరు బాలిక చెన్నూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
బలవంతంగా బాధితురాలిని ఒప్పించి...
బాలిక పోలీసులను ఆశ్రయించిన విషయం తెలుసుకున్న రెవెన్యూ ఉద్యోగి తనను కేసు నుంచి రక్షించాలని కోరుతూ చెన్నూరు మండలానికి చెందిన టీడీపీ నేతలను ఆశ్రయించాడు. దీంతో సదరు టీడీపీ నేతలు కామాంధుడిని రక్షించడానికి రంగంలోకి దిగారు. ఏకంగా పోలీస్‌స్టేషన్ వేదికగా పంచాయితీ పెట్టారు. ‘‘అయిందేదో అయింది... కేసు పెడితే ఏం వస్తుంది... అతని నుంచి ఒక లక్ష రూపాయలు ఇప్పిస్తాం...’’ అవి ఉపయోగపడతాయని బాధితురాలిని బలవంతంగా పంచాయితీకి ఒప్పించారు.
ఈ క్రమంలో పంచాయితీకి సహకరించినందుకు పోలీసులకు రూ.50 వేలు, పంచాయతీ చేసిన టీడీపీ నేతలకు రూ.2 లక్షలను సదరు రెవెన్యూ ఉద్యోగి ముట్టచెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి బాలికకు న్యాయం చేయాల్సిన అవసరముంది.


