జానపదంలో మేటి పరిశోధకుడు ‘పేటశ్రీ’
కడప ఎడ్యుకేషన్: జానపద పరిశోధనలో అనేక అంశాలను వెలుగులోకి తీసుకురావడమేగాక, విద్యార్థులచే పరిశోధనలు చేయించిన మేటి పరిశోధకులు ఆచార్య పేట శ్రీనివాసరెడ్డి అని మైదుకూరు తెలుగు అధ్యాపకుడు డాక్టర్.కోడూరు జయప్రకాశ్ అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ’నెలనెలా సీమ సాహిత్యం’ 150వ సదస్సులో భాగంగా ’ఆచార్య పేట శ్రీనివాసరెడ్డి జీవితం– సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం ఆదివారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జయప్రకాశ్ మాట్లాడుతూ ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి (పేటశ్రీ) కథారచయితగా, జానపద పరిశోధకులుగా, విమర్శకులుగా తనదైన శైలిలో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారన్నారు. పేటశ్రీ జానపద సాహిత్యంపై విమర్శనా గ్రంథాలు రాయడమే కాక అనేక గేయాలను సంకలనం చేసి ప్రచురించారన్నారు. 150 కథలు, వివిధ పత్రికల్లో 230 వ్యాసాలు రాశారన్నారు. చిత్తూరు జిల్లా జానపద విజ్ఞానం, తెలుగు ఐతిహ్యాలు, తిరుపతి కథలు, తిరుమల కథలు, తిరుమల–తిరుపతి కథలు, గొబ్బి పాటలు, జానపద గేయాల్లో శ్రీకృష్ణుడు’ లాంటి అనేక రచనలు చేశారన్నారు. కార్యక్రమాన్ని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి సమన్వయం చేశారు. కార్యక్రమ ప్రారంభంలో వక్త డాక్టర్ కోడూరు జయప్రకాశ్‌ను సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్. చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, సిబ్బంది, ఎస్. సుబ్బరాయుడు, కొత్తపల్లె రామాంజనేయులు, కృష్ణానందం, కందిమళ్ల రాజారెడ్డి తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో ప్రసాద్, చంద్రశేఖరరెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, ముడియం కిశోర్ కుమార్, నాగిరెడ్డి, రఘునాథ రెడ్డి, మల్లేష్, దక్షిణామూర్తి, లక్ష్మిరెడ్డి, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


