ఉపాధ్యాయులేమైనా యంత్రాలా!
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయులను యంత్రాలుగా భావిస్తూ, నిరంతరం బోధనేతర కార్యక్రమాలతో విద్యా బోధనకు దూరం చేస్తూ వేధింపులకు గురిచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. కడప యూటీఎఫ్ భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విద్యాశక్తి పేరుతో వందరోజుల ప్రణాళిక రూపొందించి, పండుగలు, సెలవు దినాలలో పనిచేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు పరీక్ష నిర్వహించి, అదే రోజు సాయంత్రానికల్లా మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఒత్తిడి చేయడం సరైనది కాదన్నారు. ముస్తాబు కార్యక్రమం పేరుతో ఉపాధ్యాయులపై మరింత ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులకు తగినంత సమయం కేటాయించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే ప్రణాళిక రూపొందించాలి కానీ ముస్తాబు, బోధనేతర పనుల ద్వారా ఉపాధ్యాయుల బోధన సమయాన్ని హరించే విధంగా ప్రణాళికలు రూపొందించడం వెనుక ప్రభుత్వ విద్యా రంగాన్ని పతనావస్థకు తీసుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు భావించవలసి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.నాగార్జున రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సి ల్ సభ్యులు, వివిధ విభాగాల కన్వీనర్లు పాల్గొన్నారు.


