భూపేష్.. బోగస్ కమిటీల భరతం పట్టాలి
కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారు. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన భూపేష్ సుబ్బరామిరెడ్డి అసలైన కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు కోరారు. ఆదివారం స్థానిక అల్మాస్‌పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయచంద్ర, మహమ్మద్ షా, కొండ్రెడ్డి జనార్దన్‌రెడ్డి, కొండా సుబ్బయ్యలు మాట్లాడారు. మొన్నటివరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రధానంగా ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని జెండాను మోసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కడప నగర కమిటీకి అధిష్టానం నుంచి ఆమోదం తెలుపలేదన్నారు. అయితే శ్రీనివాసులురెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి తాను నియమించుకున్న కమిటీని అఽధికారికంగా ప్రకటించడం దారుణమన్నారు. అలాగే జిల్లా కమిటీలో కూడా ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపుదారులతో నింపేశారన్నారు. జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి ఈ కమిటీలను పరిశీలించి వాస్తవాలను గ్రహించి పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కోరారు.


