గాండ్ల తెలికుల హక్కుల సాధన కోసం పోరాటం
కడప ఎడ్యుకేషన్ : గాండ్ల తెలికుల హక్కుల సాధనే తమ ఎజండా అని హక్కుల సాధన కోసం ఎంతవరకై నా పోరాడుతామని అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమ సంఘం(ఏజీటీయూపీఎస్‌ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ పేర్కొన్నారు. కడప నగరంలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఉన్న సమావేశం మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకట విజయభాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో గాండ్ల తెలికులకు పాలకమండలి చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక జీఓ ఇవ్వాలన్నారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో కూడా గాండ్ల తెలికులకు కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ సమాజంలో గాండ్ల తెలికులను కూడా అన్ని కులాలతో పాటు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీటీయూపీఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు గిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముక్కెర హరినాథ్, ట్రెజరర్ యాదాటి శివప్రసాద్ , అనంతపురం జిల్లా అధ్యక్షుడు సిగిచర్ల నాగరాజు, జిల్లా గౌరవాధ్యక్షుడే కొసినేపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర కోశాధికారి వీరపు లక్ష్మిపతి పాల్గొన్నారు.


