సమస్యలకేదీ పరిష్కారం?
కడప సెవెన్‌రోడ్స్ : ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా మారింది. క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించకపోవడంతో కలెక్టర్‌కు మొర పెట్టుకుంటే సమస్యలు తీరుతాయన్న కొండంత ఆశతో వ్యయ ప్రయాసలు కోర్చి జనం గ్రీవెన్స్‌కు బారులు తీరుతున్నారు. అధికారుల ఎదుట తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఫిర్యాదులు అధికంగా వచ్చే మొదటి పది శాఖల్లో రెవెన్యూ అగ్రగామిగా ఉంటోంది. మొత్తం వచ్చే ఫిర్యాదుల్లో భూమి సమస్యలే అత్యధికంగా ఉంటున్నాయి. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయే తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. అర్జీల పరిష్కారానికి సంబంధించి అధికారులు చూపెడుతున్న గణాంకాలు క్షేత్ర స్థాయి వాస్తవాలకు బిన్నంగా ఉన్నాయి. ఆర్థికేతర అంశాలు సైతం పరిష్కారం కావడం లేదు. దీర్ఘకాల భూ సమస్యలు పరిష్కరించేందుకంటూ బుధవారం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పీజీఆర్‌ఎస్ వల్ల కూడా ఫలితం కనిపించడం లేదు. జవాబుదారి తనం, పారదర్శకత, గడువులోపు అర్జీల పరిష్కారం వంటివి మాటలకే పరిమితం అవుతున్నాయి. దీంతో అర్జీదారులు వచ్చిన వారే మళ్లీ గ్రీవెన్స్‌కు రావడం సర్వసాధారణంగా మారింది. రెవెన్యూ క్లినిక్స్, జీరో టాలెరెన్స్ విధానం, ఆడిట్ వంటి పొద్దుపోని మాటలతో ప్రభుత్వం, అధికారులు ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
భూమి సమస్యలే అత్యధికం
రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్)కు సంబంఽధించి భూమి స్వభావం, వర్గీకరణ, విస్తీర్ణ సవరణకు సంబంధించిన అర్జీలు అధికంగా ఉంటున్నాయి. తర్వాత మ్యూటేషన్స్, ఇంటిపట్టాలు, రీ సర్వేకు సంబంధించి ఆర్‌ఓఆర్ డేటా సవరణలు, నిరుపేదలు, మాజీ సైనికులకు ప్రభుత్వ భూముల అసైన్‌మెంట్, ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణలు వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠం, బద్వేలు, కాశినాయన, గోపవరం మండలాల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోరుమామిళ్ల మండలంలో బెంగళూరు–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే సమీపంలో సర్వే నంబర్ 72లో ఆర్‌ఎస్‌ఆర్ దాఖలా మేరకు 146 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ భూమిని సర్వే నంబర్ 73 అని చూపెట్టి ఇతరుల పేరుతో ఆన్‌లైన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఈ విషయంపై హైకోర్టులో రిట్ పిటీషన్ సైతం దాఖలు చేసినట్లు చెబుతున్నారు. పోరుమామిళ్లమండలంలో మచ్చుకు రెండు సమస్యలను పరిశీలిస్తే...
ప్రహసనంగా పీజీఆర్‌ఎస్
పేరుకుపోతున్న ఫిర్యాదులు
భూ సమస్యలే అత్యధికం


