వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి సీతారామలక్ష్మణులను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చంటిపిల్ల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, టీటీడీ ఆలయ సివిల్ విభాగం ఏఈ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు.
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు.
పాత పీజీఆర్‌ఎస్‌లో నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను ఈ సోమవారం పాత పీజీఆర్‌ఎస్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. అర్జీదారులు‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్’వెబ్‌సైట్‌లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలియజేశారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని డీఆర్వో పేర్కొన్నారు.
సాక్షి కథనంపై
‘రెవెన్యూ’లో కదలిక
– నీటి మునక ప్రాంతం
పరిశీలించిన అధికారులు
కడప కార్పొరేషన్ : జిల్లా కేంద్రమైన కడపలో కొత్త కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్న వైనంపై ఈనెల 28వ తేది ‘బాబోయ్ బూచోళ్లు’ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై రెవెన్యూ శాఖలో కదలిక వచ్చింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆదివారం డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌ఓ లు ఎన్‌టీఆర్ నగర్ వద్దనున్న ప్రభుత్వ భూమి (నీటి మునక) ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ వంక వెంబడి గతంలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తహసీల్దార్ శివరామిరెడ్డి ఉన్న సమయంలో మార్కింగ్ వేసి కొన్నింటిని కూల్చివేశారు. తాజాగా కాలువకు అడ్డంగా మరికొన్ని ఆక్రమ కట్టడాలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. చిన్నచౌకు గ్రామ పొలం సర్వే నంబర్‌లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది రెవెన్యూ రికార్డుల్లో నీటి మునక, వంక పొరంబోకుగా ఉంది. దీనిపై ప్రైవేటు వ్యక్తులకు, రెవెన్యూ శాఖకు మధ్య చాలా ఏళ్లుగా కోర్టు కేసు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లు విలువజేసే ఈ భూమిపై అ ధికార పార్టీ నేతల కన్ను పడింది. దీన్ని ఎలాగైనా సొంతం చేసుకునేందుకు పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు జరిపిన పరిశీలనలో కూడా వారు తమ వద్ద పొజిషన్ పత్రాలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.


