సకాలంలో పనులు పూర్తి చేయాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర, జిల్లా కార్యాలయం నుంచి వచ్చే పనులను సీఆర్‌ఎంటీలు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.ప్రేమంత కుమార్ ఆదేశించారు. శనివారం కడప నగరంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలోని 36 మండలాలకు సంబంధించిన సీఆర్‌ఎం టీచర్లకు సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి వచ్చే పనుల పైన ఒక్క రోజు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ సమగ్ర శిక్ష, విద్యాశాఖకు సంబంధించిన ప్రతి ప్రతి రిపోర్టు సీఆర్‌ఎం టీచర్ల ద్వారానే జరుగుతున్నాయన్నారు. 90 శాతం పనులు సకాలంలో జరుగుతున్నాయని మిగిలిన 10 శాతం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమంత్‌కుమార్ మాట్లాడుతూ సీఆర్‌ఎం టీచర్లు తమ క్లస్టర్ పరిధిలో పూర్తి సమాచారాన్ని తమ దగ్గర క్రోఢీకరించుకొని ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ జిల్లా నోడల్ ఆఫీసర్, డైట్ లెక్చరర్ గిరిబాబు మాట్లాడుతూ పరీక్షపై చర్చ 2026కు సంబంధించి ఉపాధ్యాయలు విద్యార్థుల తల్లిదండ్రులతో రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారులు విజయ భాస్కర్, నరసింహరాజు, రమణమూర్తి, ఉపేంద్ర యాదవ్ తదితరులు మాట్లాడారు.


