మంచుపడి.. పూత మాడి
● తెగుళ్లబారిన మామిడి తోటలు
● తీవ్రమైన చలితో చిగుర్లు వస్తున్న వైనం
● ఫలించని రైతుల ముందస్తు ఆశలు..
● రెండో దశ పూతపైనే ఆశలు
రాయచోటి : వాతావరణ మార్పులు ‘ఫలరాజం’పై పగబట్టాయి. ముందస్తు దిగుబడుల కోసం శ్రమించిన జిల్లా మామిడి రైతుల ఆశలు ఫలించలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు సమయం నుంచే తోటల్లో సాగు పనులు మొదలుపెట్టారు. అయితే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో కురిసిన వర్షాలు మామిడి తోటలపై తీవ్ర ప్రభావం చూపాయి. తీవ్రమైన చలి, మంచు వల్ల చెట్లలో పూతకు బదులు చిగుర్లు వస్తున్నాయి. చెట్లకు వేడిమి కోసం మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించ లేదు. దీంతో రైతులు రెండో దశ పూతపైనే ఆశలు పెట్టుకుంటున్నారు.
● నవంబర్ నెల నుంచి మామిడి తోటల్లో మొదటి దశ, డిసెంబర్‌లో రెండో దశ పూత వస్తుంది. అయితే ఈసారి ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పూత రావడం ఆలస్యమైంది. గత ఏడాది దిగుబడులు ఆలస్యం కావడం, జులై, ఆగస్టు నెల వరకు దిగుబడులు ఉండటంతో నవంబర్ నెలలో కొన్నిచోట్ల మాత్రమే పూతలు వచ్చాయి. అయితే వర్షాల కారణంగా అవి కూడా మాడిపోయాయి. వర్షాలు కురవని ప్రాంతంలో మాత్రమే పూత మిగిలింది. డిసెంబర్ నెలలో కూడా మెజార్టీ తోటల్లో పూతకు బదులుగా చిగుర్లు వస్తుండటంతో రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చిగుర్లు ముదిరేందుకు, ఉన్న కొద్దిపాటి పూతలను కాపాడుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చించి మందులను పిచికారీ చేస్తున్నారు.
తేనె మంచు పురుగు
తోటల్లో ఉన్న కొద్దిపాటి పూతలకు తెగుళ్లు సోకుతున్నాయి. ప్రధానంగా తేనెమంచు పురుగు రైతులను కలవరపెడుతోంది. చిగుర్లు, పూతలకు వీటి బెడద అధికమైంది. నల్లి, పచ్చ పురుగు కూడా సోకుతోంది. దీంతోపూతను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు పడుతున్నారు.


