జిల్లా కేంద్రం మారుస్తారంటూ ఆత్మహత్యాయత్నం
రాయచోటి : కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రకటన, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంగా మారుస్తున్నారన్న వదంతులపై రాయచోటిలో శనివారం ఆందోళనలు ఉధృతమయ్యాయి. జేఏసీ, స్థానిక ప్రజాశక్తి సంఘాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రాయచోటి పట్టణంలోని నేతాజీ, వైఎస్‌ఆర్ కూడళ్లలో ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగించరాదంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్, హసన్‌బాషాలు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వెంటనే వారించి వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు సత్వరం చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
నేడు బంద్‌కు పిలుపు
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంలో కలుపుతున్నారంటూ వచ్చిన వదంతులపై జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, ఉద్యోగులు, సంఘాలు పాల్గొనాలని శనివారం రాత్రి ఒక ప్రకటనలో కోరింది.


