భయాందోళనలో సిబ్బంది
కడప సిటీ: ఉపాధిహామీ పథకానికి మంగళం పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2006 ఫిబ్రవరిలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండపల్లె గ్రామంలో సోనియాగాందీ చేతుల మీదుగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) ప్రారంభించారు. దీనిని ప్రవేశపెట్టి 19 సంవత్సరాల 10 నెలల 15 రోజులైంది. అయితే ఈ పథకం పేరు మార్చేందుకు ప్రస్తుత మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. వికసిత్‌భారత్ గ్రామీణ రోజ్‌గార్, అవిజీక మిషన్ (వీబీజీ ఆర్‌ఏఎం)గా రూపకల్పన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పార్లమెంట్‌లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. మెజార్టీ ఉన్నందువల్ల ఈ పథకం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నిధుల ఖర్చులో కూడా తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూలీలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేది. మెటీరియల్‌కు, పండ్లతోటల పెంపకానికి 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతూ వస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రం 40 శాతం ముందుగా చెల్లిస్తేనే కేంద్రం 60 శాతం నిధులు విడుదల చేస్తుంది.
10 శాతం చెల్లించలేమన్న చంద్రబాబు
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పది శాతం కూడా కేంద్రమే భరించాలని వెల్లడించడమే కాకుండా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ నిధుల ఖర్చు గతంలో కంటే మరో 30 శాతం చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అయితే పది శాతం మేర నిధులు చెల్లించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుండగా, ఈ విధానం అమలులోకి వస్తే అసలు రాష్ట్రంలో ఉపాధి పథకం ఉంటుందా? ఊడుతుందా? అనే ఆందోళనలు అటు సిబ్బంది, ఇటు కూలీల్లోనూ నెలకొంది.
● వికసిత్ భారత్ గ్యాంరటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ బిల్లు–2025పై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రాలపై భరించలేనంత భారం మోపి పరోక్షంగా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.
ప్రధానంగా ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లోనే ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దోహదపడుతోంది. నిధుల ఖర్చులో భారీ తేడా ఉన్నందువల్ల సకాలంలో వేతనాలు అందుతాయా? లేదా? అన్న ఆందోళనలో కూలీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లించలేని పరిస్థితి ఉంటే వేతనాలుసకాలంలో అందే పరిస్థితి ఉండదు. దీంతో గ్రామీణ ఆర్థికాభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది.
పథకానికి పేరు మార్పు
ఉపాధిహామీ పథకానికి కొత్త పేరును పెట్టేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఇది అమలైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియడం లేదు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరు ప్రస్తుతం ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్– అవిజీక మిషన్ (వీబీజీఆర్‌ఏఎం)గా మార్పు చేసేందుకు అడుగులు వేస్తోంది.. అయితే నిధుల తేడా కూడా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉంటుందా? ఊడుతుందా? అనే సందిగ్ధం
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి వీబీఆర్ ఆర్‌ఏఎం పేరు మార్పునకు కేంద్రం శ్రీకారం
పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన వైనం
లోక్‌సభలో బిల్లును వెనక్కి తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్
ఆందోళనలో గ్రామీణ కూలీలు
ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు చేయడమే కాకుండా నిధుల ఖర్చులో కూడా తేడాలు ఉంటున్నాయని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పథకంలో 100 శాతం కూలీలకు కేంద్ర ప్రభుత్వమే నిధులను ఖర్చుచేస్తోంది. మెటీరియల్‌కు, ప్లాంటేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసేది. కొత్త పథకంలో మార్పులు భారీగా ఉంటాయని సిబ్బంది భావిస్తున్నారు. కూలీలకు కూడా ఉచితంగా కాకుండా 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించే విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లిస్తుందా? లేదా? అన్న అనుమానాలు సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి. పది శాతానికే రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడుతుంటే అంతకు మూడింతలు పెంచే పరిస్థితి కనిపించడంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? ఊడుతాయా? అన్న భయాందోళనలో సిబ్బంది ఉన్నారు.
ఇంకా గైడ్‌లైన్స్ రాలేదు
ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పేరు మారుతోందని చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకు ఎటువంటి గైడ్‌లైన్స్ ఈ మార్పు గురించి రాలేదు. ఒకవేళ మార్పు చేస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలుచేయాల్సి ఉంటుంది. – ఆదిశేషారెడ్డి, డ్వామా పీడీ, కడప
భయాందోళనలో సిబ్బంది
భయాందోళనలో సిబ్బంది


