30న వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం
కడప సెవెన్‌రోడ్స్: వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్బంగా ప్రతి ఒక్కరూ స్వామి వారిని దర్శిచుకుని ఆయన కృపా కటాక్షాలు పొందాలని దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమోహన్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్బంగా విశేష పూజలు నిర్వహించాలని టీటీడీ వారు నిర్ణయించారన్నారు. అందులో భాగంగా అర్దరాత్రి 1.30 గంటలనుంచి స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారన్నారు. రాత్రి 12 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆరాధన, ఇతర విశేష పూజలు నిర్వహించి 1.30 గంటలకు గరుడ వాహనంపై వైకుంఠ ద్వారం వద్దకు స్వామి వారు చేరుకుంటారన్నారు. అప్పటి నుంచి ఉదయం 11.30 గంటల వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. అలాగే తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబరు 30, 31, జనవరి 1వ తేదీల్లో ఆన్‌లైన్ టిక్కెట్లు ఉన్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారన్నారు. దర్శనం టిక్కెట్టు లేని వారికి జనవరి 2 నుంచి క్యూలై న్ లోకి అనుమతిస్తారన్నారు. భక్తులు టీటీడీ వారికి సహకరించాలని ఆయన కోరారు.


