నీళ్ల ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలి మృతి
రాయచోటి టౌన్ : నీళ్ల ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన రాయచోటి పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీలో నివాసముండే మకుర్నిసా (65) అనే వృద్ధురాలు బుధవారం రాత్రి బయటి నుంచి ఇంటిలోకి వెళుతోంది. అక్కడే ఉన్న నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ ఆమెను గమనించక ట్యాంకర్‌ను వెనక్కు మళ్లించే క్రమంలో ఆమెను ఢీకొంది. వెనుక చక్రం కింద పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
జాతీయ స్థాయి సైన్స్‌ఫేర్‌కు కడప విద్యార్థి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రస్థాయి సైన్సు ఫేర్‌లో భాగంగా ఈ నెల 23, 24 తేదీలలో విజయవాడ మురళి రిసార్ట్స్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్‌లో కడప విద్యార్థి ఘన విజయం సాధించి సౌత్ జోన్ సైన్సుఫేర్‌కు ఎంపికయ్యాడు. కడప నగరం అంగడివీధి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఓ. గిరీష్ అనే విద్యార్థి గైడ్ టీచర్ మాధవి నారాయణ మార్గ దర్శకత్వంలో స్నేక్ బైట్ అలర్ట్ అనే వర్కింగ్ మోడల్‌ను ప్రదర్శించి తమ ప్రతిభను చాటి అందరి మన్ననలు పొందాడు. రాష్ట్రస్థాయిలో ఘన విజయం సాధించిన విద్యార్థి గిరిష్ త్వరలో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్సుఫేర్‌లో పాల్గొననున్నాడు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్‌లో ప్రతిభ చాటిన విద్యార్థి గిరీష్, గైడ్ టీచర్ మాధవి నారాయణ, జిల్లా సైన్సు అధికారి వేపరాల ఎబినేజర్‌లను ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ క్రిష్ణారెడ్డి, డీఈఓ షేక్ షంషుదీ్‌ద్న్ అభినందించారు.


