ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది లెక్కల గోవర్దన్‌రెడ్డి(30) అనే యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రాంతమైన గండికోటలో జరిగింది. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె గ్రామానికి చెందిన లెక్కల గోవర్దన్‌రెడ్డి ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు కొండారెడ్డి, లక్ష్మీదేవి చనిపోయారు. ఇతనికి ముగ్గురు అక్కలు. తల్లిదండ్రులు చనిపోవడంతో పెద్ద అక్క అయిన భారతి భర్త థర్మల్‌లో ఉద్యోగం చేస్తుండటంతో గోవర్దన్‌రెడ్డిని తీసుకెళ్లి బీటెక్ వరకు చదివించారు. కానీ ఉద్యోగం రాకపోవడంతో అక్క వద్దనే ఉంటూ థర్మల్‌లో హోటల్ పెట్టుకొని జీవిస్తున్నాడు. మంగళవారం హోటల్ మూసివేసి ప్రొద్దుటూరుకు వెళ్లి వస్తా అని అక్కతో చెప్పి ఇంటినుంచి వచ్చాడు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గండికోటలో ప్రైవేట్ రిసార్ట్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. బుధవారం తెల్లవారి 9 గంటలైనా తలుపులు తెరవకపోవడంతో గది యాజమానికి అనుమానం వచ్చి పిలువగా పలకలేదు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి చూడగా చీర అంచుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నట్లు తెలిసింది. ఆ మేరకు అతని కుటుంబ సభ్యులకు విషయం చేరవేశారు. ఉరివేసుకునే ముందు లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని రాశాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉన్న ఒక్క తమ్ముడు చనిపోవడంతో ముగ్గురు అక్కలు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు.


