● సెమీ క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ కుటుంబం
వేంపల్లె మండలం ఇడుపులపాయలోని నెమళ్ల పార్కు పక్కన ఉన్న ఓపెన్ ఎయిర్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను వైఎస్ కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష, వర్షలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఏటా వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులు సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 7గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ లో వైఎస్ విజయమ్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనారోగ్య కారణంగా సెమీ క్రిస్మస్ వేడుకలకు మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేకపోయారు.వైఎస్ కుటుంబ సభ్యుల సమక్షంలో పాస్టర్లు మృత్యుంజయరావు, బెనహర్, నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థ నలు చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం బంధువులందరినీ పలకరిస్తూ వారి యోగ క్షేమాలను వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ విజయమ్మలు అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మేనత్త విమలమ్మ, అరకు ఎంపీ తనూజా రాణి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి సతీమణి సమతమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, షేక్షావలి, మునీర్, మటన్ బాబా, పోతిరెడ్డి శంకరయ్య, తువ్వపల్లె వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


