మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అస్వస్థత!
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాటి కార్యక్రమాలు రద్దు అయ్యాయి. జ్వరంతో బాధ పడుతుండటంతో వైద్యుల సూచన మేరకు కార్యక్రమాలను రద్దు చేసుకొని విశ్రాంతి తీసుకున్నారు. బెంగళూరు నుంచి మంగళవారం ఆయన పులివెందులకు చేరుకున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ వేడుకల్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కాగా, అనారోగ్యం కారణంగా బుధవారం ఇడుపులపాయలోని సెమీ క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు పులివెందులలోని ఆయన నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉంది. అనంతరం ‘వైఎస్’ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భోజనాలు అనంతరం పులివెందుల భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుని, ప్రజాదర్బార్ చేపట్టాల్సి ఉంది. తీవ్ర జ్వరం కారణంగా డాక్టర్ల సలహా మేరకు కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
బుధవారం కార్యక్రమాలు రద్దు
డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతికి పరిమితం


