వైఎస్సార్ సీపీ అందరికీ అండగా ఉంటుంది
పులివెందుల: కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జ్వరంతో బాధపడుతుండడంతో తన రెండవ రోజు పర్యటన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. భాకరాపురంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచేకాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన ప్రజలను నిరాశపరచకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను ఆయా ప్రాంతాల వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలియజేస్తూ, మరికొన్ని సమస్యలను తానే పరిష్కరిస్తూ, మరికొన్నింటిని జగనన్నకు తెలియజేస్తానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కొంతమంది తమను కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఎంపీ దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగనన్న అండగా ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎదుర్కొని వారు చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అంజద్ బాషా, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు.
● ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


