నిరంతరాయ విద్యుత్ సరఫరా ధ్యేయం
కడప సెవెన్‌రోడ్స్ : నిరంతరాయ విద్యుత్ సరఫరాను ప్రజలకు అందించడమే లక్ష్యంగా విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ లో ‘కరంటోళ్ల జనబాట’ అనే కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ శాఖ ప్రచురించిన పోస్టర్లను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆవిష్కరించి, ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా కడప జిల్లాలో వినూత్నంగా ‘కరంటోళ్ల జనబాట’ అనే కార్యక్రమానికి విద్యుత్ శాఖ వారు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళ, శుక్రవారా ల్లో విద్యుత్ శాఖ అధికారులు నేరుగా గ్రామాలు, వాడలు, హాబిటేషన్లను క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సందర్శిస్తారన్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన సమస్యలను వెంటనే ‘కరంటోళ్ల జనబాట’ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ పీడీసీఎల్ కడప సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


