ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం ముద్దనూరు రోడ్డులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం ఎదురుగా బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సును ఎదురుగా బైక్‌పై వచ్చి యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వచ్చిన యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఐ నాగ మురళి తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వినాయక్ శర్వాన్ చౌద్రి (34), కరణ్ విలాస్ తెలంగే (24) అనే యువకులు ఎర్రగుంట్ల మండలంలోని జువారి సిమెంట్ ఫ్యాక్టరీలో తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ బాబయ్య వద్ద కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు సుమారు పది రోజుల క్రితమే మహారాష్ట్ర నుంచి వచ్చి పనిలో చేరారు. అయితే గత నాలుగు రోజుల నుంచి వీరు పనికి రాకుండా బయట తిరుగుతున్నట్లు కాంట్రాక్టర్ తెలిపాడని ఎస్‌ఐ అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళుతుండగా, అదే సమయంలో ఇద్దరు యువకులు ఎర్రగుంట్ల నుంచి ముద్దనూరు వైపు బైక్‌పై బయలు దేరారు. కానీ ఇద్దరు యువకులు రాంగ్ రూట్‌లో వెళ్లి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వున్న యువకులు అక్కడికక్కడే రక్తగాయాలతో మృతి చెందారు. ఈ సంఘటన స్థానికుల మనుసులను కలచి వేసింది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ నాగమురళి పరిశీలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం మృతదేహాలను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరదేశీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రాంగ్ రూట్‌లో వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన యువకులు
అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
మృతులిద్దరూ మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు


