ప్రజాగ్రహానికి నిదర్శనం ‘కోటి సంతకాలు’
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనేందుకు కోటి సంతకాలే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీపీపీ పేరు చెప్పి మెడికల్ కాలేజీలను అమ్మేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎకరా లీజు రూ.99లకు 60 ఏళ్లు అంటే అమ్మేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. కరోనాలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అలాంటి పరిస్థితి మళ్లీ ఉత్పన్నం కాకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి 7 కాలేజీలను పూర్తి చేసి, అడ్మిషన్లు కూడా తీసుకున్నారన్నారు. ఆ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయుటకు నాబార్డు ద్వారా రూ.8500కోట్లు రుణం కూడా మంజూరు చేయించారన్నారు. పాడేరు, పులివెందుల కాలేజీలకు ఎన్‌ఎంసీ మెడికల్ సీట్లు ఇస్తే, ప్రభుత్వం పులివెందుల కాలేజీకి ఇచ్చిన సీట్లను వద్దని చెప్పడం దుర్మార్గమన్నారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిందని, ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేసి ప్రైవేటీకరణ వల్ల కలిగే అనర్థాలను వివరించి వారి సంతకాలు సేకరించడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు జరిగిన ఈ మహోద్యమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 4,80,101 సంతకాలు సేకరించామన్నారు. సంతకాల సేకరణలో కష్టపడిన నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంతకాలను ఈనెల 15న కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈనెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్య నేతల ద్వారా గవర్నర్‌కు అందజేస్తామన్నారు.
● కడప మేయర్, ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక ద్వారా లబ్ధిపొందాలని అధికార టీడీపీ ప్రయత్నించిందని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వల్ల వైఎస్సార్‌సీపీలో వైషమ్యాలు వస్తాయని వారు భావించారని, కానీ వారి పాచిక పారలేదన్నారు. కడప మేయర్ పదవికి మూడు నెలలు, ముద్దనూరు ఎంపీపీ పదవికి ఐదు నెలలు మాత్ర మే గడువు ఉందన్నారు. తమ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ప్రలోభాలకు తలొగ్గకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉన్న అభిమానంతో వైఎస్సార్‌సీపీ వెంట ఉండటం గర్వంగా ఉందన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేయర్‌గా ఎన్నికై న పాకా సురేష్‌కు, ముద్దనూరు ఎంపీపీ పుష్పలతకు అభినందనలు తెలిపారు.
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు, రౌడీలు, గూండాలను ఉపయోగించి అధికార పార్టీ గెలుచుకుందన్నారు. ఇప్పుడు జరిగిన మేయర్, ఎంపీపీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంపపెట్టు అన్నారు. ఈ జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోట అని ఎవరూ దీన్ని బద్దలు కొట్టలేరన్నారు. ఈ సమావేశంలో మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఫయాజ్ పాల్గొన్నారు.
పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు
ఈనెల 18న ఈ సంతకాలను గవర్నర్‌కు అందించనున్న వైఎస్ జగన్
మేయర్, ఎంపీపీ ఎన్నిక ద్వారా టీడీపీ లబ్ధి పొందాలని ప్రయత్నించింది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి


