నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు
కడప సెవెన్‌రోడ్స్: నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఇందుకు జిల్లాలో సమర్థ వంతమైన నీటి భద్రత, సంరక్షణ, నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ లో ఐఐటి ఢిల్లీ, నీతి ఆయోగ్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ లో జిల్లా రివర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్ కింద జిల్లా స్థాయి నీటి నిర్వహణపై ప్యానలిస్ట్‌గా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సదస్సులో మాట్లాడుతూ జిల్లాలో దీర్ఘకాలిక నీటి భద్రత కోసం నాలుగు పద్ధతులను వివరించారు. వర్షపు నీటిని సంరక్షించడం, నదుల ప్రవాహ నిర్వహణను మెరుగుపరచడం, భూగర్భజలాల నీటి మట్టాన్ని పెంచడం, ప్రణాళిక బద్ధంగా జలాశయాల నీటి నిర్వహణ, సమర్థవంతమైన నదీ పరీవాహక నిర్వహణ కోసం పంటలు పర్యావరణ వ్యవస్థ లకు తేమ నిలుపుదల శాతాన్ని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో నీటిపారుదల, తాగునీరు, ఆరోగ్యం మరియు పర్యావరణ నిర్వహణలోని అంతరాల నిర్మూలన, వికేంద్రీకృత మురుగునీటి శుద్ధి వ్యవస్థ, చిత్తడి నేలల పునరుద్ధరణ, చెక్–డ్యామ్‌లు, బిందు సేద్యం మరియు ఖచ్చితమైన వ్యవసాయ పద్ధతులు మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ వంటి అంశాల అమలు, వ్యవసాయం లో సమర్థవంతమైన నీటి వినియోగం వంటి కేంద్రీకత మార్గాల ద్వారా పరిష్కరించ వచ్చునని వివరించారు. నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, అడవులు మరియు పట్టణ స్థానిక సంస్థలలో శాఖా పరంగా బలోపేతం చేయడం, సమర్థవంతమైన వినియోగంపై నీటి నిర్వహణ ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది సాధ్యమవ్వడానికి ఒక డిస్ట్రిక్ట్ వాటర్ గవర్నెన్స్ కమిటీని మరియు డిస్ట్రిక్ట్ పిఎమ్‌యు(ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్)ని ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రతిపాదించారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫోర్ వాటర్ విధానం జిల్లాల లో సమర్థ వంతంగా అమలు ద్వారా సంపూర్ణ, సుస్థిరాభివృద్ధి ఆధారిత నీటి నిర్వహణ కు మార్గదర్శకంగా నిలుస్తుందని వివరించారు.
జిల్లాలో సమర్థవంతమైన నీటి భద్రతకు ప్రణాళికలు
ఢిల్లీ లో 10వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్‌లోకలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


