కడప మేయర్‌గా కొత్తమద్ది స్థానంలో పాకా
సత్తా చాటుకున్న వైఎస్సార్‌సీపీ..
టీడీపీకి శృంగభంగం
సాక్షి ప్రతినిధి, కడప: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్‌గా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మధ్య ఐక్యత, నేతల సమన్వయంతో వైఎస్సార్‌సీపీ ఖాతాను కొనసాగించారు. పట్టుబట్టి మేయర్‌పై అనర్హత వేటు వేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. ప్రధానంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి అంచనాలు తలకిందులయ్యాయి. వెరసి ఏకంగా మేయర్ ఎన్నిక పోటీలో లేమంటూ టీడీపీ తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
● మాధవీరెడ్డి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కార్పొరేషన్‌లో మేయర్‌గా ఉన్న కొత్తమద్ది సురేష్ బాబు అంటే సరిపడేది కాదు. మేయర్ స్థానానికి దీటుగా ఎమ్మెల్యేకు కుర్చీ వేయలేదనేది ఇందుకు ప్రధాన కారణం. ఆపై మేయర్ పీఠం నుంచి సురేష్‌బాబును దించేందుకు పగబట్టి, ప్రభుత్వ ఆదేశాలతో పట్టు సాధించించారు. మేయర్ ఎన్నిక అనివార్యమైన ఆస్థానంలో కొత్తమద్ది సురేష్ కాస్తా మారిపోయి పాకా సురేష్ వచ్చి తిష్టవేశారు. మేయర్ పీఠంపై సురేష్ నామధేయుడు పదిలంగా ఉండిపోయారు. సురేష్ ను మేయ ర్ పీఠం నుంచి దించాలని పంతం పట్టిన మాధవీరెడ్డికి మరో సురేష్ వచ్చి తిష్ట వేయడం మింగుడుపడని పరిణామంగా మారిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
అంచనాలు తలకిందులు...
అధికార బలంలో కడప మేయర్‌గా ఉన్న సురేష్‌బాబును తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. స్వయంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎట్టకేలకు మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు కోసం టీడీపీ అర్రులు చాచింది. టీడీపీ అంచనాలు తలకిందులయ్యాయి. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఐక్యతను పసిగట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మేయర్ ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బాహాటంగా ప్రకటించాల్సి వచ్చింది. మరోవైపు కడప కార్పొరేషన్ అభివృద్ధి కోసం నూతన మేయర్‌కు సహకరిస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే ఇప్పటికీ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు లభించలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ దిశగా మాధవీరెడ్డి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.
ఆశీర్వాదం: అంతకుముందు నూతనంగా ఎన్నికై న మేయర్ పాకా సురేష్‌ను హిందూ, ముస్లిం, క్రిష్టియన్ మత పెద్దలు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు.
పట్టుబట్టి కడప మేయర్‌పై అనర్హత వేటు
ఆపై మేయర్ స్థానానికి ఎన్నిక అనివార్యం
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మధ్య చీలికల కోసం టీడీపీ ఆరాటం
ఐక్యంగా కార్పొరేటర్ పాకా సురేష్ ఎంపికకు నేతల సహకారం
మేయర్ స్థానాన్ని ఏకగ్రీవంగా కై వసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్(48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి(49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47మంది కార్పొరేటర్లులో 8మంది పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్ల మధ్య అసంతృప్తులు తలెత్తి కొందరినైనా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతారని ఆపార్టీ నేతలు ఆశించారు. కానీ టీడీపీ నేతల ఆశలు ఫలించలేదు. కాగా.. మేయర్ సీటు కోసం వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మధ్య పోటీ ఏర్పడినా తుదకు ఏకాభిప్రాయంతో పాకా సురేష్‌ను మేయర్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కడప మేయర్‌గా కొత్తమద్ది స్థానంలో పాకా
కడప మేయర్‌గా కొత్తమద్ది స్థానంలో పాకా


