ఆదర్శమూర్తి.. భక్త కనకదాసు
కడప సెవెన్‌రోడ్స్: తత్వవేత్త, కవి, సంగీతకారుడు, స్వరకర్త అయిన భక్త కనక దాసు సమాజాన్నే కాక భగవంతుణ్ణి సైతం మెప్పించిన ఆదర్శమూర్తి అని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీశ్రీ భక్త కనకదాసు జయంత్యుత్సవ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడుతోపాటు ఎస్డీసీ వెంకటపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ కనకదాసు కర్ణాటక సంగీతం కోసం ఎనలేని సేవ చేశారన్నారు. కర్ణాటకలో జన్మించిన ఆయన మంచి విద్యావంతులుగా సమాజాన్ని అన్నికోణాల్లో సూక్ష్మ పరిశీలన చేశారన్నారు. కనకదాసు సైన్యంలో కూడా పని చేసినట్లు అతని కీర్తనలు ఆధారంగా తెలుస్తోందన్నారు. కురవ కులానికి చెందిన కనకదాసు కూడా అప్పట్లో కుల వివక్షతను ఎదుర్కొన్నారన్నారు. ఆయన భక్తికి మెచ్చిన ఆ కృష్ణ భగవానుడే సాక్షాత్తు ఆయనకు ఆలయ ప్రవేశం సుగమం చేయడంతో కనకదాసు భక్తి సమాజంలో ప్రసిద్ధిగాంచిందని.. భక్త కనకదాసు చరితాన్ని గుర్తు చేశారు. కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు, బీసీ కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు


