కడప అగ్రికల్చర్: మార్కెట్‌లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. పదిహేను రోజుల ముందు వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ప్రస్తుతం అర్థ సెంచరీ, సెంచరీలకు చేరువయ్యాయి. కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వర్షారు కురవకముందు రూ. 100లు పెడితే నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయలు దొరికేవని.. నేడు ఆ పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. కూరగాయల ధరతోపాటు ఆకుకూరల ధరలూ పెరిగాయి.
వరుణుడి ప్రతాపంతో...
మోంథా తుపాన్ అటు పంటలతోపాటు ఇటు సామాన్యలనూ కూడా గడగడలాడించింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు సాగు చేసిన రైతులూ ఇబ్బందులు పడ్డారు. వరుస వర్షాలతో జిల్లా లోని చాలా మేర ఆకుకూరలు, కూరగాయల పంటల్లో నీరు నిలిచి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. రైతు బజార్‌లోనే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇక బయట మార్కెట్‌లో ధరలు చుక్కలనంటుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 9900 హెక్టార్లలో కూరగాయలు, 340 హెక్టార్లలో ఆకుకూరల పంటలు సాగులో ఉండేవి. మెంథా దెబ్బకు కొంతమేర ఆకుకూరలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
కార్తిక మాసాన .. ధరలు ఆకాశాన
కార్తిక మాసం మొదలవడంతో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలో అయ్యప్ప స్వామి మాలలు ధరించిన భక్తులతోపాటు ఎక్కువ మంది మాంసాహారం తీసుకోరు. దీనికి తోడు గృహ ప్రవేశాలు, వివాహాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో క్యారెట్, బీన్సు, చిక్కుడు, మిరప, వంగ, బీర వంటి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. జిల్లాకు సరిపడా కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి అవుతున్నాయి. దీంతో వ్యాపారులు అడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది.
కిలో రూ. 45 పలుకుతున్న బీరకాయలు
కిలో రూ.78 పలుకుతున్న క్యారెట్
వరుస వర్షాలతో దెబ్బతిన్న కూరగాయలు, ఆకుకూరల పంటలు
ఒక్కసారిగా పెరిగిన ధరలు
బంగాళదుంప 35 45
క్యారెట్ 55 78
దొండకాయ 35 58
క్యాప్సికమ్ 55 70
టమోట 15 20
ముల్లంగి 35 50
వంకాయ 40 55
బెండకాయ 25 35
బీరకాయ 40 45
కాకరకాయ 40 50
మట్టికాయ 45 50
అలసందలు 50 55
అనపకాయ 55 55
ధరలు బాగా పెరిగాయి..
కూరగాయలు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లాలంటే భయమేస్తోంది. దాదాపు అన్ని కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. ఇళ్ల వద్దకు వచ్చే కూరగాయల ధరలు మరింత అధికంగా ఉన్నాయి. ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో అర్థం కావడం లేదు. –నాగలక్ష్మి, కడప
తక్కువ ధరలకు సరఫరా చేయాలి
కూరగాయల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం కల్పించుకుని తక్కువ ధరలకు సరఫరా చేయాలి. రైతులు పండించిన కూరగాయలకు మాత్రం సరైన ధర ఉండదు. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కూరగాయలను కొని రైతు బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు అందచేయాలి.
– నారాయణమ్మ, కడప
సామాన్యులపై ధరాభారం!
సామాన్యులపై ధరాభారం!
సామాన్యులపై ధరాభారం!


