అండర్–11 బ్యాడ్మింటన్ పోటీలు షురూ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో అండర్–11 బాల బాలికల రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. శనివారం నిర్వహించిన క్యాలిఫయింగ్ రౌండ్లకు తమ సత్తా చాటేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు దాదాపు 400 మంది వరకు హాజరైనట్లు డీఎస్‌డీఓ బాషా, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ జిలానీ బాషా, సెక్రటరీ నాగరాజు తెలిపారు. నేటి నుంచి నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలు 11 తేదీ వరకు జరుగుతాయన్నారు. కాగా తొలి రోజు 38 మంది క్వాలిఫై అయ్యారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఈ ఏడాది అండర్–11జాతీయస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు డిసెంబర్ 8 నుంచి 14 వరకు గుజరాత్‌లోని వడదోరలో జరగనున్నాయని వెల్లడించారు.
ప్రొద్దుటూరు కల్చరల్: విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని డీఈఓ షంషుద్దీన్ పేర్కొన్నారు. స్థానిక జార్జికారొనేషన్ క్లబ్‌లో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహించా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న అమరావతిలో రాష్ట్రస్థాయి స్టూడెంట్ మాక్ అసెంబ్లీని నిర్వహిస్తున్నారన్నారు. నియోజకవర్గం నుంచి ఒక్కొక్క విద్యార్థిని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేశామన్నారు. జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీలో విద్యార్థులు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ప్రజల సమస్యలను సభ దృష్టికి తేవడం, అధికార, ప్రతిపక్ష నాయకులుగా విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ అందరిని ఆకట్టుకుంది. ఉపవిద్యాశాఖాధికారులు మీనాక్షి, రాజగోపాల్‌రెడ్డి, పోటీల జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్ చిట్టిబాబు, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభారాణి, నేతాజీ సోషల్ క్లబ్ కన్వీనర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు.
అండర్–11 బ్యాడ్మింటన్ పోటీలు షురూ


