ఘనంగా కొండయ్యస్వామి జన్మదిన వేడుకలు
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాయపల్లెలో బుధవారం అవధూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఊసయ్యగారి ఆశ్రమంలో ఉదయం కొండయ్యస్వామి భక్తులు, శిష్య బృందం సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని, 500 కిలోల నాలుగు భారీ కేక్‌లను వేదికపై ఉన్న కొండయ్యస్వామి కట్ చేసి అందరికి పంపిణీ చేశారు. అవధూత కొండయ్య స్వామిని దర్శించుకునేందుకు పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, శిఉ్యలు తరలి వచ్చారు. మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్‌ఐ చిరంజీవి తమ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటం, చెక్క భజన ఆకట్టుకున్నాయి. రాత్రి టీవీ కళాకారులతో నిర్వహించిన జబర్దస్త్ కార్యక్రమం అలరించింది. ఆశ్రమం ఆవరణలో పౌరాణిక నాటకాల ప్రదర్శన నిర్వహించారు. కాగా గురువారం ఉదయం వృషభరాజములకు రాష్ట్రస్థాయి ప్రత్యేక బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


