పరిమళించిన ఆధ్యాత్మిక గంధం
గంధంలో పాల్గొన్న పీఠాధిపతి ఆరిఫుల్లాహ్ హుసైని, సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్,
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మదనపల్లె వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి నిసార్ అహ్మద్, తదితరులు
కడప సెవెన్‌రోడ్స్: ఆధ్యాత్మిక సుగంధం పరిమళించింది....అందరి మనసుల నిండా భక్తిభావం ఉట్టిపడింది....ఆ ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. హజరత్ సూఫీ సర్ మస్తాని చిల్లాకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రీ సాహెబ్ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తన నివాసం నుంచి అలంకరించిన గంధం కలశంతో ఫకీర్ల మేళతాళాలు, సాహస విన్యాసాల మధ్య ఊరేగింపుగా దర్గాలోని గురువుల మజార్ వద్దకు తరలి వెళ్లారు. గంధం సమర్పించి ఫాతెహా నిర్వహించారు. గంధ మహోత్సవంలో ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముషాయిరా హాలులో దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంస్థల వార్షిక నివేదికతోపాటు అమీన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు విశేషాలను, విజయాలను నిర్వాహకులు పీఠాధిపతికి సమర్పించారు. అనంతరం దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో నిర్వహించిన పలు పో టీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.
దీక్షలో మలంగ్‌షా
ఈ సందర్భంగా మలంగ్‌షాను పీఠాధిపతి దీక్ష వహింపజేశారు. దర్గా నుంచి కడప నగరంలోని పలు ముఖ్య కూడళ్ల మీదుగా వెళ్లిన మలంగ్‌షా, అనుచర బృందం నాగరాజుపేటలోని బాదుల్లాసాహెబ్ మకాన్‌కు చేరింది. మకాన్ నిర్వాహకులు, స్థానిక భక్తులు వారిని ఘనంగా స్వాగతించారు. సాయంత్రం ఆ బృందం ఊరేగింపుగా తిరిగి దర్గాకు చేరుకుంది. రాత్రి మలంగ్‌షా దర్గా ఆవరణంలోని పీర్లచావిడిలో దీక్ష వహించారు. దర్గా పీఠాధిపతి స్వయంగా వెళ్లి ఆయనకు సంప్రదాయబద్ధంగా దీక్ష వహింపజేశారు.
కడప కార్పొరేషన్: పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా ప్రతినిధులు అలీఖాన్, అమీర్ కోరారు. బుధవారం పెద్ద దర్గా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెద్ద దర్గా ఉరుసు ప్రాశస్త్యాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేయడం కోసమే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి 10వ తేది వరకూ ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. మానవత్వమే సర్వమత సారాంశమని, లోక కళ్యాణం కోసం ఈ ఉత్సవాల నిర్వహిస్తున్నామన్నారు.ఆధ్యాత్మిక అభివృద్ధి, సూఫీ తత్వాన్ని, శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పేందుకు జరిగే ఈ ఉత్సవాలను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.
కడప కార్పొరేషన్: పెద్ద దర్గా ఉరుసుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన పెద్ద దర్గాను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమీన్ పీర్ దర్గా ఉత్సవాలకు 400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, 200 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని వెల్లడించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా, నేరాలు చోటు చేసుకోకుండా ఉత్సవాలు విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. పెద్ద దర్గా ఉరుసు సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్సీ ఎన్. సుధాకర్, కడప డీఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు, పలువురు సీఐలు ఉన్నారు.
ఫకీర్ల మేళతాళాల మధ్య దర్గాకు చేరుకున్న పీఠాధిపతి
గురువు మజార్ వద్ద గంధం సమర్పణ
దీక్ష చేపట్టిన మలంగ్‌షా
జనసంద్రంగా దర్గా ప్రాంగణం
మానవత్వమే సర్వమత సారాంశం
పెద్ద దర్గా ప్రతినిధులు అలీఖాన్, అమీర్
పరిమళించిన ఆధ్యాత్మిక గంధం
పరిమళించిన ఆధ్యాత్మిక గంధం
పరిమళించిన ఆధ్యాత్మిక గంధం
పరిమళించిన ఆధ్యాత్మిక గంధం


